తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరుగనుంది. బుధవారం సాయంత్రం 5.30 నుండి రాత్రి 8 గంటల వరకు పుణ్యాహవాచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవము, శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది. మే 16వ తేదీ గురువారం ఉదయం 8.15 నుంచి 8.40 గంటల మధ్య ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈరోజు ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. మే 21 నుండి 29వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.