మేము టీటీడీకి నెయ్యిని సరఫరా చేయలేదు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి లడ్డూ తయారీకి సంబంధించి ఎప్పుడూ నెయ్యి సరఫరా చేయలేదని డెయిరీ దిగ్గజం అమూల్ స్పష్టం చేసింది
By Medi Samrat Published on 21 Sept 2024 10:54 AM ISTతిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి లడ్డూ తయారీకి సంబంధించి ఎప్పుడూ నెయ్యి సరఫరా చేయలేదని డెయిరీ దిగ్గజం అమూల్ స్పష్టం చేసింది. “తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి అమూల్ నెయ్యి సరఫరా చేశామని కొన్ని సోషల్ మీడియా పోస్ట్‌లు తెలిపాయి. అయితే మేము టీటీడీకి ఎప్పుడూ అమూల్ నెయ్యి సరఫరా చేయలేదని చెబుతున్నాం." అంటూ అమూల్ ఒక ప్రకటనలో వివరించింది. తమ డైరీలలోని పాలు కఠినమైన నాణ్యత తనిఖీల ద్వారా ప్రజల దగ్గరకు వెళ్తాయని అమూల్ స్పష్టం చేసింది. ”అమూల్ నెయ్యి ISO సర్టిఫికేట్ పొందిన మా అత్యాధునిక ఉత్పత్తి కేంద్రాలలో పాలతో తయారు చేస్తామని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము. అమూల్ నెయ్యి అధిక నాణ్యత ఉన్న స్వచ్ఛమైన పాల కొవ్వుతో తయారు చేస్తాం." అని అమూల్ వివరించింది.
లడ్డూలపై వివాదం నెలకొనడంతో కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను ప్రసాదం చేయడానికి నందిని నెయ్యిని మాత్రమే ఉపయోగించాలని ఆదేశించింది. రాష్ట్రంలో 35,000 దేవాలయాలు ఉన్నాయి, అవి ఇప్పుడు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) ఆధీనంలోని నందిని నెయ్యిని మాత్రమే లడ్డూలు లేదా మరేదైనా స్వీట్లను నైవేద్యంగా తయారు చేయడానికి తప్పనిసరిగా ఉపయోగించాలని ఆదేశించినట్లు ప్రభుత్వ సర్క్యులర్ తెలిపింది. రాష్ట్రంలోని 99 శాతం ఆలయాల్లో ఇప్పటికే నందిని నెయ్యి వినియోగిస్తున్నారని, దీన్ని ఇప్పుడు అన్ని ఆలయాలకు విస్తరింపజేస్తామని కర్ణాటక మంత్రి రామలింగా రెడ్డి తెలిపారు.