వైకుంఠ ఏకాదశికి తిరుమలకు వెళ్లాలనుకుంటున్నారా..? ఇది తెలుసుకోండి

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 10 నుండి 19 వరకు పది రోజుల వైకుంఠ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లను డిసెంబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.

By Medi Samrat  Published on  22 Dec 2024 3:15 PM GMT
వైకుంఠ ఏకాదశికి తిరుమలకు వెళ్లాలనుకుంటున్నారా..? ఇది తెలుసుకోండి

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 10 నుండి 19 వరకు పది రోజుల వైకుంఠ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లను డిసెంబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. అలాగే పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను డిసెంబరు 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు. ఈ నేపథ్యంలో మార్చి నెల శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల తేదీలను మార్పులు చేశారు. డిసెంబరు 25వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. డిసెంబరు 26వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. అదే రోజు సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను విడుదల చేస్తారు. ఈ మార్పును గమనించి టీటీడీ వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in లో మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా టీటీడీ భక్తులను కోరింది.

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 10న వైకుంఠ ఏకాదశి, 11న వైకుంఠ ద్వాదశి పర్వదినాల‌ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జనవరి 10న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున 12.05 గంటల నుండి 3.30 గంట వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. వేకువజామున 3.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు రాత్రి కైంకర్యాలు తిరిగి 5 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. అదేవిధంగా జ‌న‌వ‌రి 11న వైకుంఠ ద్వాదశి సంద‌ర్భంగా ఉద‌యం 4 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తారు.

ఆంగ్ల నూత‌న సంవ‌త్స‌రాది 2025 జనవరి 1న‌ వేకువజామున 1 గంట నుండి 4 గంటల‌ వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. వేకువజామున 4 నుండి సాయంత్రం 5 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు రాత్రి కైంకర్యాలు, తిరిగి సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

Next Story