భక్తుల రద్దీతో కిటకిటలాడుతన్న తిరుమల.. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం
తిరుమలలో మునుపెన్నడూ లేని విధంగా రద్దీ ఏర్పడింది. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు.
By అంజి Published on 19 May 2023 4:30 AM GMTభక్తుల రద్దీతో కిటకిటలాడుతన్న తిరుమల.. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం
తిరుపతి: తిరుమలలో మునుపెన్నడూ లేని విధంగా రద్దీ ఏర్పడింది. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. గురువారం వేంకటేశ్వర స్వామికి ప్రార్థనలు చేయడానికి భక్తులు దాదాపు 30 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సేపు క్యూ లైన్లలో వేచి ఉండవలసి వచ్చింది. వేసవి సెలవుల కారణంగా యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ - I, II ఆలయ పట్టణంలోని ఇతర ముఖ్యమైన పాయింట్లతో పాటు యాత్రికుల కార్యకలాపాలతో సందడిగా ఉన్నాయి.
గురువారం శ్రీవారిని 66,820 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.29 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 36,905 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక బుధవారం నాడు సుమారు 79,207 మంది భక్తులు పూజలు చేయగా ఒక్కరోజే 3.19 కోట్ల రూపాయల హుండీ కానుకలు వచ్చినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. గురువారం సాయంత్రం క్యూలైన్లలో ఉన్న వారు దర్శనం కోసం ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి 30 గంటలకు పైగా వేచి ఉన్నారు.
గురువారం తెల్లవారుజాము నుంచే వైకుంటం క్యూ కాంప్లెక్స్-II పూర్తిగా నిండిపోయింది. క్యూ లైన్లలో భక్తులు నిలబడి కనిపించారు. రింగ్ రోడ్డులోని ఎంట్రీ పాయింట్ నుంచి క్యూ లైన్ వరకు భక్తులు చాలా దూరం నడిచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కు చేరుకున్నారు.
వసతి సౌకర్యాలు లేని భక్తులు ఫుట్‌పాత్‌లు, పార్కులపై విశ్రాంతి తీసుకుంటున్నారు. టీటీడీ కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి, ఆలయ సీనియర్ అధికారులు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు నిరీక్షణ సమయంలో ఆహారం, నీరు మరియు ఇతర నిత్యావసరాలను సరఫరా చేసేలా చూశారు. హనుమాన్ జయంతి ఉత్సవాల చివరి రోజు కావడంతో తిరుమలలోని అంజనాద్రి ఆకాశగంగ తీర్థంలో అంజనా దేవి సమేత బాల ఆంజనేయ స్వామికి ఈఓ ధర్మారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. దేవతలకు ప్రత్యేక అభిషేకం, సుదర్శన చక్రత్తాళ్వార్‌కు చక్రస్నానం నిర్వహించారు.