నవరాత్రి ఉత్సవాలకు వేళాయె.. తేదీలు తెలుసుకోండి
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి.
By - Medi Samrat |
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అదేవిధంగా సాయంత్రం ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. అక్టోబరు 2వ తేదీ విజయదశమినాడు శ్రీపద్మావతి అమ్మవారు రాత్రి 7.45 గంటలకు విశేషమైన గజ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. నవరాత్రి ఉత్సవాల కారణంగా ఈ 10 రోజుల పాటు కల్యాణోత్సవంను రద్దు చేశారు. సెప్టెంబరు 26న లక్ష్మీపూజ సేవలు రద్దయ్యాయి.
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో సెప్టెంబరు 17 నుండి 19వ తేదీ వరకు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం సెప్టెంబరు 16న సాయంత్రం అంకురార్పణ జరుగనుంది. యాత్రికుల వల్ల, సిబ్బంది వల్ల తెలియక జరిగే దోషాలవల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. పవిత్రోత్సవాల్లో మొదటి రోజైన సెప్టెంబరు 17న పవిత్ర ప్రతిష్ఠ, సెప్టెంబరు 18న పవిత్ర సమర్పణ, పవిత్ర హోమాలు చేపడతారు. చివరిరోజు సెప్టెంబరు 19న మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన జరుగనుంది. పవిత్రోత్సవాల సందర్భంగా ప్రతి రోజు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.