తిరుమల శ్రీవారికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. తిరుమల వేంకటేశ్వరస్వామికి తెలుగు రాష్ట్రాల‌కు చెందిన భ‌క్తులే కాకుండా దేశ విదేశాల్లో భ‌క్తులు అనేక మంది ఉన్నారు. స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు దూరాన్ని సైతం లెక్క‌చేయ‌కుండా విదేశాల నుంచి భ‌క్తులు వ‌స్తుంటారు. దీంతో శ్రీవారి ఆల‌యం నిత్యం ర‌ద్దీగా ఉంటుంది. భ‌క్తులు మొక్కలు కూడా చెల్లించుకుంటారు. ప్రతి రోజు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంటుంది. ఇక గురువారం శ్రీవారిని 50,087 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక ఆదాయం విషయంలో ప్రతి రోజు దాదాపు 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఆదాయం వస్తుండగా, గురువారం ఒక్క రోజు మాత్రం రికార్డ్‌ స్థాయిలో ఆదాయం వచ్చి చేరింది. హుండీ ఆదాయం ఏకంగా రూ.5.21 కోట్ల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

అలాగే 25,466 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. అయితే కరోనా కాలంలో శ్రీవారి ఆదాయం పూర్తిగా తగ్గిపోగా, క్రమ క్రమంగా భక్తుల రద్దీ పెరగడంతో తిరిగి ఆదాయం పెరిగింది. తిరుమల వెంకన్నకు రోజురోజుకు ఆదాయం పెరుగుతుందే తప్ప ఏ మాత్రం తగ్గదు. కరోనా కారణంగా గతంలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోగా, అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో మెల్లమెల్లగా భక్తుల రద్దీ పెరిగింది.

టీటీడీ కీల‌క నిర్ణ‌యం..

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవేంకటేశ్వరుని ఉత్సవమూర్తుల పరిరక్షణకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అభిషేకాలను తగ్గించాలని నిర్ణయించింది. ప్రతి సోమవారం నిర్వహించే విశేష పూజతో పాటు బుధవారం చేసే సహస్ర కలశాభిషేకం, నిత్యం నిర్వహించే ఆర్జిత వసంతోత్సవ సేవలను ఏడాదికి ఒక్కసారే నిర్వహించనున్నారు. తద్వారా మలయప్ప స్వామితో పాటు శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాల అరుగుదలను నిరోధించవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల జరిగిన ధర్మకర్తల మండలిలో తీర్మానించారు.


తోట‌ వంశీ కుమార్‌

Next Story