తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు
Ratha Saptami Celebrations in Tirumala.శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు
By తోట వంశీ కుమార్ Published on 28 Jan 2023 3:14 AM GMTతిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు కన్నులపండుగగా జరుగుతున్నాయి. సూర్యప్రభ వాహనం పై స్వామి వారు తిరుమాఢ వీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు. సూర్య నారాయణుడి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమినాడు రథ సప్తమి వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్వహిస్తోంది.
నేడు స్వామి వారు సప్తవాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శ్రీమలయప్ప స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహనసేవలు మొదలు కాగా.. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం నిర్వహించనున్నారు. అదేవిధంగా.. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ సేవ జరగనుంది. దీంతో వాహనసేవలు ముగుస్తాయి.
వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్, పిఎసి-2, 4, వైకుంఠం క్యూ కాంప్లెక్సులో అన్నప్రసాద వితరణతోపాటు గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, టి, కాఫి, పాలు, మజ్జిగ అందించేందుకు ఏర్పాట్లు చేశారు. రథసప్తమి సందర్భంగా సర్వదర్శనం భక్తులు జారీ చేసే టోకెన్లు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేశారు.
నిన్న శ్రీవారిని 59,695 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,286 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ద్వారా రూ.4.06కోట్ల ఆదాయం వచ్చింది.