కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో అంగప్రదక్షిణం చేయాలనే భక్తులకు అలర్ట్. ఫిబ్రవరి నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్లను నేడు(మంగళవారం) మధ్యాహ్నాం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తెలిపింది. అయితే.. శ్రీవారి ఆలయంలో బాలాలయం కారణంగా ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు అంగప్రదక్షిణ టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు చెప్పింది. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గుర్తించి ఆన్‌లైన్‌లో టోకెన్లు బుక్ చేసుకోవాలని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. అదే సమయంలో నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోనే టోకెన్లు బుక్ చేసుకోవాలని సూచించింది.
ఇదిలా ఉంటే.. శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం స్వామి వారిని 70,413 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,206 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. నేడు(మంగళవారం) స్వామి వారి దర్శనం కోసం 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.