తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సురేష్ ఖండేరావు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.

By Medi Samrat  Published on  23 Sep 2024 6:45 AM GMT
తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సురేష్ ఖండేరావు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌లో లడ్డూ వివాదంపై సీబీఐ లేదా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో దర్యాప్తు జరపాలని కోరారు. దేశవ్యాప్తంగా దేవాలయాల నిర్వహణకు సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తిని నియమించాలని అభ్యర్థించారు. తిరుపతి దేవస్థానంలో ప్రసాదం కల్తీలో వైఎస్సార్‌సీపీ ప్రమేయం ఉందని ఆరోపించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల వెనుక రాజకీయ ప్రేరేపిత కుట్ర ఉందని తెలిపారు. చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని, టీటీడీ బోర్డు పవిత్రతను దెబ్బతీశాయని లేఖలో పేర్కొన్నారు.

తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీపై వాస్తవాలను తేల్చేందుకు హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టును కోరారు. ఒకవేళ సిట్టింగ్‌ జడ్జితో విచారణ సాధ్యం కాకపోతే, విచారణ నిమిత్తం ఓ కమిటీని ఏర్పాటుచేయాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు.

Next Story