జనసేనాని పవన్ కళ్యాణ్ తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారానికి షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు పర్యటన వివరాల్ని జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు. ఏప్రిల్ 3న ప్రచారం మొదలవనుండగా.. ఆ రోజు తిరుపతిలో పవన్ కళ్యాణ్ పాదయాత్ర ఉంటుంది. ఎంఆర్ పల్లి సర్కిల్ వద్ద నుంచి శంకరంబాడి సర్కిల్ వరకు కవాతు తరహా పాదయాత్ర చేస్తారు.
పాదయాత్ర అనంతరం శంకరంబాడి సర్కిల్ వద్ద బహిరంగ సభ ఉంటుంది. ఆ తర్వాత మరో దఫా నెల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బిజెపి-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉన్న రత్నప్రభ గెలుపు కోసం పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు.
ఇదిలావుంటే.. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. వైసీపీ, బీజేపీ, సీపీఎం అభ్యర్థులు నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి, బీజేపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇప్పటికే నామినేషన్ వేసిన టీడీడీ అభ్యర్థి పనబాక లక్ష్మి ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా చింతామోహన్ సాదాసీదాగా నామినేషన్ దాఖలు చేశారు.