శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు భక్తుల సౌకర్యార్థం టీటీడీలోని వివిధ ట్రస్టులకు, పథకాలకు విరాళాలు అందించిన దాతలకు కేటాయించే గదులను టీటీడీ రద్దు చేసింది. అక్టోబరు 4న ధ్వజారోహణం, అక్టోబర్ 12న చక్రస్నానం జరిగే రోజుల్లో మినహా మిగతా రోజులలో దాతలను దర్శనానికి అనుమతిస్తారు. కావున దాతలు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరుతున్నారు.
ఆగస్టు 27వ తేదీన శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో రాత్రి 8 నుండి 10 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామివారిని వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తారు. శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ద్వాదశారాధనం చేపడతారు. ఆగస్టు 28న తిరుమలలో ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఈ ఉత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో విహరిస్తారు. యువకులు ఎంతో ఉత్సాహంతో ఉట్లను కొడుతూ స్వామివార్లకు ఆనందాన్ని చేకూర్చుతారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 28న శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిసేవలైన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.