శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి హరీశ్‌రావు
Minister Harish Rao vists Tirumala Temple.కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారిని మంత్రి హరీశ్‌రావు శుక్రవారం
By తోట వంశీ కుమార్
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారిని మంత్రి హరీశ్‌రావు శుక్రవారం దర్శించుకున్నారు. ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా స్వామి వారి దర్శనం చేసుకున్నారు.
గురువారం రాత్రి అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు మంత్రి హరీశ్‌రావు. శుక్రవారం ఉదయం తలనీలాలు సమర్పించుకుని వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో మంత్రి హరీష్ రావుకు వేదపండితులు ఆశీర్వచనం అందించగా, టీటీడీ ఆలయ అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు.
అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. నేటితో తాను 50వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా స్వామి వారి ఆశీస్సులు పొందడానికి తిరుమల వచ్చినట్లు చెప్పారు.
తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, మిత్రులెవరూ హైదరాబాద్, సిద్దిపేట రావొద్దని ఇప్పటికే హరీశ్‌రావు కోరారు. ముందే నిర్ణయించుకొన్న వ్యక్తిగత కార్యక్రమంలో భాగంగా దూరప్రాంతంలో ఉండాల్సి వస్తున్నదని, తనపై ఉన్న ప్రేమను ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా చాటాలని అభిమానులు, కార్యకర్తలకు సూచించారు. శుభాకాంక్షలు చెప్పడానికి, ఆశీర్వదించడానికి వస్తామంటూ ఫోన్లు చేస్తున్నవారిని నిరాశ పరుస్తున్నందుకు మన్నించాలని మంత్రి హరీశ్ రావు గురువారం ట్వీట్ చేశారు. అభిమానుల ఆదరాభిమానాలు, ప్రేమను నా గుండెల్లో పెట్టుకుంటానన్నారు.