తిరుమల లడ్డూ వివాదంపై టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తమ తమ యాంగిల్ లో ప్రజల్లోకి వెళ్లగా.. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వం ఆదేశించిన దర్యాప్తు నివేదిక కోసం కూడా ఎదురుచూడకుండా ఈ విషయాన్ని ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్లారని ప్రశ్నించింది. “మీకు జూలైలో నివేదిక వచ్చింది. సెప్టెంబర్ 18న మీరు పబ్లిక్ లోకి వెళ్లారు. విచారణకు ఆదేశించానని చెప్పారు. ఇది ఉపయోగించిన నెయ్యి కాదని నివేదికను బట్టి స్పష్టమైంది. మీకు ఖచ్చితంగా తెలియకపోతే, మీరు దానితో ప్రజల్లోకి ఎందుకు వెళ్ళారు? ” అని జస్టిస్ కెవి విశ్వనాథన్ ప్రశ్నించారు.
ఇక ఈ తిరుమల లడ్డూకు సంబంధించి ప్రజా శాంతి పార్టీ నేత కేఏ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలని, తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ఆయన పిటిషన్ వేశారు. 740 మంది క్యాథలిక్స్ కోసం వాటికన్ ప్రత్యేక దేశంగా ఉందని, కోట్లాది మంది భక్తులు వచ్చే తిరుమల తిరుపతి యూనియన్ టెర్రిటరీగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. లడ్డూ వివాదంతో టీటీడీ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని కేఏ పాల్ అన్నారు. రాష్ట్రానికి వచ్చే భక్తులు తగ్గిపోతున్నారన్నారు.