ఏపీ ప్రభుత్వం టీటీడీ నూతన ఈవోగా ఐఏఎస్ అధికారి జె.శ్యామలరావును నియమించింది. శ్యామలరావు నేడు టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టారు. సంప్రదాయం ప్రకారం మొదట వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా వచ్చిన శ్యామలరావుకు టీటీడీ వర్గాలు స్వాగతం పలికాయి. ఎంతో పవిత్రత నిండిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో పదవిని అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ పదవిని చేపట్టే అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తిరుమల వచ్చే భక్తులు ఎలాంటి సమస్యలు లేకుండా స్వామి వారిని దర్శించుకుని తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు కల్పించడంపై దృష్టి సారిస్తామని శ్యామలరావు తెలిపారు.
ఇక తిరుమలలో క్యూలైన్లను పరిశీలించారు శ్యామలరావు. క్యూలైన్ల వద్ద పారిశుద్ధ్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి రోజే టీటీడీ అధికారులకు కీలక సూచనలు చేశారు. క్యూ లైన్ల వద్ద భక్తులకు అందించే త్రాగునీరును పరిశీలించి ల్యాబ్ కు పంపించాలని అధికారులకు సూచించారు. హెల్త్ విభాగంలో ఇద్దరు అధికారులకు మెమో జారీ చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చారు.