ఒకే రోజున ఏడు వాహన సేవలు.. తిరుమలకు పోటెత్తిన భక్తులు

Heavy Devotees Crowd In Tirumala Temple. సూర్య జయంతిని పురస్కరించుకుని తిరుమలలో రథసప్తమి వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహిస్తోంది.

By Medi Samrat
Published on : 19 Feb 2021 2:32 PM IST

Heavy Devotees Crowd In Tirumala Temple

తిరుమల : సూర్య జయంతిని పురస్కరించుకుని తిరుమలలో రథసప్తమి వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహిస్తోంది. ఇవాళ ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారు ఏడు ప్రధాన వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. సూర్యప్రభ వాహనంతో మొదలై చంద్రప్రభ వాహనంతో వేడుకలు ముగియనున్నాయి. ఉదయం ఐదున్నర గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ పడమర, ఉత్తర మాడవీధులు కలిసే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ మలయప్ప స్వామివారిపై సూర్యకిరణాలు తాకిన తరువాత అర్చకులు ప్రత్యేక హారతులు, నైవేద్యాలు సమర్పించి వాహన సేవలను ప్రారంభించారు.

ఉదయం 8గంటల వరకు సూర్యప్రభ వాహనంపై విహరించిన శ్రీనివాసుడు 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనంపై, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు స్వామివారికి చక్రస్నానం చేయించనున్నారు.

సాయంత్రం 4 నుంచి 5 వరకు కల్పవృక్ష వాహనంపై, సాయంత్రం 6 గంటల నుంచి 7 వరకు సర్వభూపాల వాహనంపై, రాత్రి 8 గంటల నుంచి 9 వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. ఒకే రోజున ఏడు వాహన సేవలు దర్శించుకునే అవకాశం ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో కొండకు చేరుకున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో తిరుమాడ వీధులు భక్త జనసంద్రంగా మారాయి.


Next Story