ఏడాదిలో విజయవంతంగా 729 హార్ట్ సర్జరీలు : టీటీడీ ఈవో
Free Surgeries to Children in TTD Heart Hospital. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ( గుండె చికిత్సల ఆసుపత్రి)లో ఏడాది కాలంలో
By Medi Samrat Published on 11 Oct 2022 8:22 PM ISTటీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ( గుండె చికిత్సల ఆసుపత్రి)లో ఏడాది కాలంలో 729 హార్ట్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించి, శ్రీవారి ఆశీస్సులతో చిన్నారులకు పునర్జన్మ ప్రసాదించినట్లు టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి చెప్పారు. శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంలో మంగళవారం ఈవో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. గత ఏడాది అక్టోబరు 11వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ 70 పడకలు, 3 ఆపరేషన్ థియేటర్‌లతో ఆసుపత్రిని ప్రారంభించినట్లు చెప్పారు. ఆసుపత్రి ప్రారంభించిన ఏడాది కాలంలో దేశంలోనే అత్యున్నత వైద్య సేవలు అందించే 10 ఆసుపత్రులలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుందని తెలిపారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఆపరేషన్లు చేయించే స్థోమత లేని పేద తల్లిదండ్రులకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ క్రింద రాష్ట్ర ప్రజలు, ఆయుష్మాన్ భారత్ ద్వారా ఇతర రాష్ట్రాల రోగులకు ఉచితంగా చికిత్సలు అందిస్తున్నామన్నారు.
ఒక బిడ్డ గుండె శస్త్ర చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, ఆ ఖర్చును భరించే దాతల కొరకు శ్రీ వేంకటేశ్వర ఆపన్న హృదయాలయ స్కీం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ స్కీంకు విరాళాలు అందించే దాతలకు ఐదు బ్రేక్ టికెట్లు అందిస్తున్నామన్నారు. ఒక పేషంట్‌కు సర్జరీ చేసిన ఘనత దాతలకు వస్తుందన్నారు. ఇప్పటి వరకు ఎస్వీ ఆపన్న హృదయాలయ స్కీంకు 150 మంది దాతలు విరాళాలు ఇచ్చారన్నారు. జీవన్ దాన్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసినట్లు, దాతలు ఎవరైనా గుండె ఇస్తే పిల్లలకు గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు అవసరమైన ప్రముఖ వైద్య నిపుణులు ఆసుపత్రిలో ఉన్నారని ఆయన తెలిపారు.
శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ఆసుపత్రికి 2022 మే 5న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ భూమి పూజ నిర్వహించారని, రూ.320 కోట్లతో 350 బెడ్లతో అత్యాధునిక వైద్య సదుపాయాలతో చిన్న పిల్లల ఆసుపత్రి మరో రెండు సంత్సరాలలో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఇప్పటి వరకు ఆసుపత్రి నిర్మాణానికి 160 మంది దాతలు రూ.కోటి చొప్పున విరాళంగా ఇచ్చారని, వీరికి ఉదయాస్తమాన సేవ టికెట్లు కేటాయించినట్లు తెలిపారు. త్వరలో స్విమ్స్, బర్డ్, శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ఆసుపత్రులను అనుసంధానిస్తామన్నారు. తద్వారా రోగులకు మరింత త్వరిత గతిన నాణ్యమైన వైద్య సేవలు అందిచవచ్చని చెప్పారు. త్వరలో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ల్యాబ్ ( సెంట్రలైజ్డ్ ల్యాబ్)ను ఏర్పాటు చేయనున్నట్లు ఈవో తెలిపారు. బర్డ్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక సిటి స్కాన్, ఎక్స్ రే సేవలను తిరుపతి, పరిసర ప్రాంతాల రోగులు నేరుగా వచ్చి తక్కువ ఫీజు చెల్లించి వినియోగించుకోవలసిందిగా ఈవో కోరారు.
శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథరెడ్డి మాట్లాడుతూ, ఆసుపత్రిలో 30 మంది ప్రముఖ గుండె వైద్య నిపుణులు ఒక టీంగా ఏర్పడి నిరంతరం చిన్నపిల్లలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. గుండె సమస్యలు ఉన్న పిల్లలను సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకురావలన్నారు. దేశంలోని 10 ప్రముఖ ఆసుపత్రులలోని డాక్టర్లు శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంలో ఉచితంగా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.