అలిపిరి మెట్ల మార్గం.. తిరుపతి నుండి తిరుమల కొండపైకి వెళ్లే మెట్ల మార్గం. వేలాది మంది భక్తులు వెళ్తుంటారు. లాక్ డౌన్ ఆంక్షలు.. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం భక్తుల రాక కూడా తగ్గింది. మరోవైపు ఈ మెట్ల మార్గాన్ని మరింత ముస్తాబు చేయాలని టీడీపీ భావిస్తోంది. అందుకు సంబంధించిన పనులు పెండింగ్ ఉండడంతో వాటిని పూర్తీ చేసే పనిలో పడ్డారు.
అలిపిరి మార్గాన్ని రెండు నెలల పాటు మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా ప్రకటించింది. అలిపిరి మార్గంలో మరమ్మత్తు పనులు నడుస్తున్నాయని.. నూతన పైకప్పు నిర్మాణం, ఇతర మరమ్మతుల కారణంగా జూన్ 1 నుంచి జూలై 31 వరకు అలిపిరి కాలిబాట మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాలిబాట ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులు శ్రీనివాస మంగాపురం వద్ద ఉండే శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్లాలని టీటీడీ సూచించింది. అలిపిరి నుంచి శ్రీవారి మెట్ల మార్గానికి ఉచిత బస్సులు ఏర్పాటు చేశామని టీటీడీ తెలిపింది.
కరోనా కారణంగా శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయాలు బాగా తగ్గాయి. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు తగ్గడంతో లడ్డూ ప్రసాదాల విక్రయాలు తగ్గిపోయాయి. ప్రసాదాల ద్వారా ఈ ఏడాది రూ. 375 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా వేసింది టీటీడీ. కరోనా సెకండ్ వేవ్ కారణంగా తిరుమలకు భక్తుల రాక భారీగా తగ్గింది. ఎప్పుడు భక్తులతో కిటకిటలాడే తిరుమల క్షేత్రం ఇప్పుడు వెలవెలబోతోంది. శ్రీవారిని దర్శించుకునే భక్తులు లేక తిరుమలలో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కుంటుబాలకు ఇప్పుడు ఆదాయం లేకుండా పోయింది.