నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి చెన్నై వెలుతున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలు తిరుపతి జిల్లా గూడూరు జంక్షన్ సమీపానికి వచ్చే సరికి.. రైలులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ప్రయాణీకులు భయాందోళనకు గురైయ్యారు. రైల్వే సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదమే తప్పింది.
ప్యాంట్రీ కార్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. గమనించిన సిబ్బంది గూడూరు రైల్వే స్టేషన్‌లో రైలు ఆపి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలు గంట పాటు గూడూరు రైల్వే స్టేషన్లోనే నిలిచిపోయింది. ఇక ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అటు అధికారులు, ఇటు ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. రైలును తనిఖీ చేసిన అధికారులు అనంతరం చైన్నైకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. ఇక ఈ ఘటనపై విచారణ చేపట్టామని తెలిపారు.
ఇదిలా ఉంటే.. గతంలోనూ దక్షిణ్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లా సమీపంలోని పగిడిపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన రైలు చివరి బోగీలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు రైలును అక్కడే నిలిపివేశారు. మంటలు చెలరేగిన బోగీని అక్కడే వదిలేశారు. అనంతరం మంటలను ఆర్పి వేశారు.