తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమలలోని శ్రీవేంకటేశ్వర ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు 10 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. కానుకల రూపంలో టీటీడీకి రూ.4.73 కోట్లు వచ్చినట్లు సమాచారం.
కాగా, శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి అక్టోబర్ 6 వరకు జరగనున్నాయి. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముందుగా వివరాలు వెల్లడించారు. 27న రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వీఐపీ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ రోజును పురస్కరించుకుని చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఇచ్చే కానుకలు టీటీడీకి చేరవని, భక్తులు కానుకలు సమర్పించవద్దని టీటీడీ అధికారులు కోరారు.
తిరుమల బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు రాయలసీమ రేంజ్ డీఐజీ రవిప్రకాష్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.