మన పురాణ పురుషుల గురించి యువతకు, పిల్లలకు చెప్పండి.. రాముడు, రామరాజ్యం గురించి చెప్పండని తిరుపతి వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు సూచన చేశారు. తిరుపతిలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ప్రారంభ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ వంటివి కాకుండా.. మన పురాణాల గురించి పిల్లలకు చెప్పండని సూచించారు. హలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణ పురుషులు గొప్ప వారని.. వారి చరిత్రను వివరించాలన్నారు.
సూపర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాలి. బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించాలి. మన కృష్ణుని మహిమలు, శివుడి మహత్యం గురించి యువతకు బోధించాలి. రాముడిని మించిన పురుషోత్తముడు ప్రపంచంలో ఎవ్వరూ లేరని... రామరాజ్యం గురించి వివరించాలన్నారు. అవతార్ సినిమాకంటే మన భారత, రామాయణాలు గొప్పవని పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. బకాసురుడు, కంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా చెప్పాలన్నారు. ఎవరు మంచి వాళ్లో.. ఎవరు చెడ్డవాళ్లో చెప్పగలిగితే మంచికి, చెడుకి వ్యత్యాసాలు పిల్లలకు తెలుస్తాయన్నారు.
ప్రజలు పురాణాల గురించి మరిచిపోయే సమయంలో ఎన్టీఆర్ ఎన్నో పురాణ గాధలతో కూడిన సినిమాలు చేశారన్నారు. విలువలను చెబుతూ సినిమాల ద్వారా చైతన్యం తెచ్చిన మహా నాయకుడు ఎన్టీఆర్.. రాజకీయాల్లోనూ అదే స్థాయిలో విలువలు పాటించిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. దేశాభివృద్ధికి వాజ్ పేయి పునాదులు వేశారు.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. వినూత్న ఆలోచనలు చేయాలి.. కొత్త ఆవిష్కరణలు చేపట్టాలన్నారు. భారత దేశం భవిష్యత్తులో సూపర్ పవర్ గా మారబోతోందన్నారు.