సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ ట్రైన్‌ టైమింగ్స్‌లో మార్పులు

సికింద్రాబాద్‌ - తిరుపతి మధ్య నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రయాణ సమయ వేళల్లో దక్షిణ మధ్య రైల్వే స్వల్ప మార్పులు

By అంజి  Published on  15 May 2023 9:15 AM IST
Secunderabad , Tirupati, Vandebharat Train, Train Timings, SCR

సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ ట్రైన్‌ టైమింగ్స్‌లో మార్పులు

సికింద్రాబాద్‌ - తిరుపతి మధ్య నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రయాణ సమయ వేళల్లో దక్షిణ మధ్య రైల్వే స్వల్ప మార్పులు చేసింది. ఈ సమయ వేళల మార్పులు మే 17వ తేదీ నుంచి అమలు కానున్నట్లు వెల్లడించింది. అలాగే తిరుమలకు వెళ్లే భక్తులకు మరిన్ని సేవలు అందించేందుకు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు అదనపు బోగీలను ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్‌సీఆర్‌ ప్రకటించింది. సికింద్రాబాద్‌ టూ తిరుపతి వందేభారత్‌ రైలుకు డిమాండ్‌ భారీగా ఉంది. దీంతో ప్రయాణికులు బుకింగ్‌ కోసం ఎక్కువ సమయం ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న 8 కోచ్‌లకు మరో 8 కోచ్‌లను కలపనుంది. వందేభారత్‌లో ప్రస్తుతం 530 సీట్లు ఉన్నాయి . వీటిలో ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌కార్‌- 52 సీట్లు, ఛైర్‌కార్‌‌లో సీట్లు - 478 ఉన్నాయి. కోచ్‌ల సంఖ్య పెరగడంతో సీట్ల సంఖ్య 1,060కి పెరగనుంది.

ఈ సౌకర్యం మే 17 నుంచి అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి ఉదయం 6 గంటలకు తిరుపతి బయల్దేరతున్న వందేభారత్‌ రైలు.. ఈ నెల 17 నుంచి 6.15 గంటలకు బయల్దేరనుంది. సికింద్రాబాద్‌కు వచ్చే రైలు రాత్రి 11.45కి చేరుతోంది. త్వరలో ఈ సమయం 15 నిమిషాలు తగ్గనుంది. సికింద్రాబాద్‌లో రైలు ఉదయం 6.15కు బయలుదేరి.. నల్గొండకు ఉదయం 7.29కు చేరుతుంది. గుంటూరుకు 9.35, ఒంగోలుకు 11.12కు, నెల్లూరుకు 12.29కు, తిరుపతికి 2.30కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతిలో మధ్యాహ్నం 3.15కు బయలుదేరుతుంది. నెల్లూరుకు 4.49కు, ఒంగోలుకు సాయంత్రం 6గంటలకు, గుంటూరుకు 7.45కు, నల్గొండకు రాత్రి 9.49కు సికింద్రాబాద్‌కు రాత్రి 11.30కు చేరుతుంది.

Next Story