కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం వెలుతున్నారా..? అయితే.. ఓ విషయాన్ని గమనించిండి. అక్టోబర్ 24, 25, నవంబర్ 8న బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. అక్టోబరు 24న దీపావళి ఆస్థానం, అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం కారణంగా బ్రేక్ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
ఇక.. దీపావళి ఆస్థానం కారణంగా అక్టోబర్ 24న బ్రేక్ దర్శనం రద్దు చేస్తుండడంతో అక్టోబర్ 23న సిఫార్సు లేఖలు స్వీకరించబడవని అధికారులు వెల్లడించారు. అక్టోబరు 25న సూర్యగ్రహణం కారణంగా ఉదయం 8 నుంచి రాత్రి 7.30 గంటల వరకు నవంబరు 8న చంద్రగ్రహణం కారణంగా ఉదయం 8.30 నుంచి రాత్రి దాదాపు 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచనున్నారు. అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం రోజుల్లో శ్రీవాణి, రూ.300/ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కూడా రద్దు చేసినట్లు చెప్పారు. తిరుమలకు వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు.