టీటీడీ ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఉద్యోగులు అంతర్గత ఇబ్బందులు విడనాడి ఏకంగా తమకు సహకరించాలని ఆయన కోరారు. వడమాలపేట వద్ద టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల కోసం మంజూరు చేసిన 310 ఎకరాల భూమిని ఈవో ఎవి ధర్మారెడ్డి, జేఈవో లు సదా భార్గవి, వీరబ్రహ్మం, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులతో కలసి ఆయన పరిశీలించారు.
సెప్టెంబరు 18వ తేదీ ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఇంటిస్థలాల పంపిణీ ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు. అవసరమైతే మరో 100 ఎకరాలైన ప్రభుత్వం నుండి సేకరించి అందరికీ ఇంటి స్థలాలు ఇప్పిస్తామని చైర్మన్ ప్రకటించారు. ఈ ప్రకటనతో ఉద్యోగులు ఒక్క సారిగా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, తాను ఉద్యోగులతో స్నేహపూర్వక సంబంధాలు కోరుకునే వారమని కరుణాకర్ రెడ్డి చెప్పారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే ఉద్యోగులందరికీ ఇంటిస్థలాలు వస్తున్నాయనే విషయం గుర్తు పెట్టుకోవాలని అన్నారు.