టీటీడీ చైర్మన్‌ను చూసి అందరూ నవ్వుకుంటున్నారు : భూమన

బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సంస్థను భ్రష్టు పట్టించార‌ని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మండిప‌డ్డారు.

By Medi Samrat
Published on : 20 Aug 2025 5:35 PM IST

టీటీడీ చైర్మన్‌ను చూసి అందరూ నవ్వుకుంటున్నారు : భూమన

బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సంస్థను భ్రష్టు పట్టించార‌ని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మండిప‌డ్డారు. ఆయ‌న బుధ‌వారం మీడియాతో మాట్లాడుతూ.. ఏ నీళ్లతో చేస్తే పాప పరిహారం అవుతుంది అనుకుంటామో.. పాపవినాశనం బోట్లు షికారుకు చేయించారు. మీ హయంలో వైకుంఠ ఏకాదశికి టికెట్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగింది, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు, 60 మందికి గాయాలయ్యాయి. తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పాలని అంటే.. మీకు అహం అడ్డు వచ్చింది. బాలాజీ నగర్ కాలనీలో బెల్ట్ షాప్ ఏర్పాటు చేశారు.. మద్యం అమ్మకాలు చేయలేదా.. ఢిల్లీలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నాగ ప్రతిష్ఠలపై విజిలెన్స్ విచారణ జరగలేదా.. అంటూ ప్ర‌శ్నించారు.

మసాలా లేకుండా మసాలా వడ అందించడమే గొప్ప పనా..? టీవీ 5 ఛానల్ ద్వారా ఈ వ్యక్తిత్వ హననం చేస్తున్నారు.. ఇష్టం వచ్చినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై మీ ఛానల్‌లో చూపిస్తున్నారు.. దీనికి మీపై పదికోట్ల రూపాయలు పరువు నష్టం వేయాలన్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నది మీరు.. మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మీ ఛాన‌ల్ ప్రతినిధిని పెట్టుకుని మొత్తం వ్యవహారాలు నడిపిస్తున్నారు.. కాంట్రాక్టర్లకు ఎవరు బిల్లులు ఇవ్వాలో మీరే చెప్తున్నారు.. టీటీడీ చైర్మన్‌ను చూసి అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

బీఆర్ నాయుడు స్వీపర్‌కు ఎక్కువ.. దఫెదర్‌కు తక్కువ.. రెండు గంటల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దర్శనం అన్నారు ఏమయ్యిందని ప్ర‌శ్నించారు. మీ సిఫార్సులతో అడిషనల్ ఈవో కార్యాలయంలో టికెట్లూ పొందడం లేదా.. బీఆర్ నాయుడు మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంద‌ని.. తిరుమల పవిత్రత కాపాడటం కోసం మేము వాస్తవాలు చెబుతున్నామన్నారు.

టిటిడి గోశాలలో తప్పిదాలు జరిగితే సవరించుకోలేదు.. మాపై నిందలు వేయడమే.పనిగా పెట్టుకున్నారు.. టిటిడి చైర్మన్ బి.ఆర్.నాయుడు ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారు.. మొదట్లో బీహెచ్ఈఎల్‌లో బంట్రోతు ఉద్యోగం చేశాడు. రెడిమెడ్ బట్టల దుకాణం తెరిచాడు.. ట్రావెల్ ఏజెంట్ వ్యాపారం ఎత్తి వేల కోట్లు ఎలా సంపాదించాడు.. టికెట్లపై ధరలు నియంత్రణ లేని రోజుల్లో మూడువేల ధర టికెట్ పదివేలకు పైగా వసూళ్లు చేశాడు.. ఫారిన్ ఎక్చేంజ్ ద్వారా మోసాలకు పాల్పడ్డాడు.. పెనుగొండ కాళేశ్వరం బాబా ఆస్తులు కొట్టేశాడు.. 38 ఏళ్లకే కాళేశ్వర బాబా ఎలా చనిపోయాడు విచారణ జరపాలి..? ఒక సాధారణ వ్యక్తి లక్షల కోట్లకు ఎలా అధిపతి అయ్యాడు.. టీవీ5 ఛానల్ ఎలా పెట్టాడని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

మూడవ క్యూ కాంప్లెక్స్ ఎందుకు కట్టాల్సి వస్తోంది, ఆర్టిఫీషియల్ ద్వారా గంటలోపే దర్శనం చేయించే మీకు మూడవ క్యూ కాంప్లెక్స్ ఎందుకు..? అని ప్ర‌శ్నించారు. వీఐపీ తగ్గిస్తామని చెప్పి అత్యధికంగా టికెట్లూ ఇస్తూ ఉన్నారు. శ్రీవాణి రద్దు చేస్తాము అని చెప్పి.. ఈరోజు ఎక్కువ టిక్కెట్లు ఇస్తున్నారు.. రద్దు చేసే దమ్ము మీకు ఉందా..? అని ప్ర‌శ్నించారు. సాక్షి చానెల్ వల్లనే ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బ్రతికిఉంది.. మాపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు.

Next Story