వైకుంఠ ఏకాదశికి టీటీడీ స్థానిక ఆలయాలు ముస్తాబు

Arrangements In Ttd Temples For Vaikuntha Ekadashi. జ‌న‌వ‌రి 2వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ స్థానిక ఆలయాలలో భక్తుల

By Medi Samrat  Published on  31 Dec 2022 2:14 PM GMT
వైకుంఠ ఏకాదశికి టీటీడీ స్థానిక ఆలయాలు ముస్తాబు

జ‌న‌వ‌రి 2వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ స్థానిక ఆలయాలలో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు.

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో..

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో జనవరి 2న వైకుంఠ ఏకాదశి సంద‌ర్భంగా అమ్మవారికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉద‌యం 8.30 నుండి 10 గంట‌ల వ‌ర‌కు శ్రీ కృష్ణ‌స్వామివారి ముఖ మండ‌పంలో అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్నారు. అనంత‌రం ఉద‌యం 11 నుండి మధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు తిరుచ్చిపై ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, అష్టదళ పాదపద్మారాధన సేవలను టిటిడి రద్దు చేసింది.

జ‌న‌వ‌రి 3వ తేదీ ద్వాదశి నాడు ఉదయం 7 నుండి 9 గంటల వరకు శ్రీసుదర్శన చక్రత్తాళ్వార్‌కు తిరుమంజనం, చక్రస్నానం జరుగనుంది.

శ్రీనివాసమంగాపురంలో..

జనవరి 2న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున 12.05 గంటల నుండి 2 గంట వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. వేకువజామున 2 నుండి రాత్రి 8.30 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈ సందర్భంగా జనవరి 2న ఆర్జిత కల్యాణోత్సవం రద్దు కానున్నాయి.

అదేవిధంగా జ‌న‌వ‌రి 3న వైకుంఠ ద్వాదశి సంద‌ర్భంగా ఉద‌యం 4 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉద‌యం 10 నుండి 11 గంట‌ల వ‌ర‌కు చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తారు.

అప్పలాయగుంటలో..

అప్పలాయగుంటలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జ‌న‌వ‌రి 2న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువ జామున 3 నుండి 4 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉదయం 5 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరగనుంది. అనంతరం రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారు.

జ‌న‌వ‌రి 3న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 7 నుండి 8 గంటల వరకు స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించనున్నారు.

నారాయణవనంలో..

నారాయణవనంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేకువజామున 2 నుండి 4 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 4 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 5 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీవారి గ్రామోత్సవం, ఆస్థానం నిర్వహించనున్నారు.

జనవరి 3న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 8.15 గంటల నుండి భక్తులకు ఉత్తర ద్వారా దర్శనం కల్పిస్తారు.

నాగలాపురంలో..

నాగలాపురం వేద నారాయణస్వామివారి ఆలయంలో జ‌న‌వ‌రి 2న వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని వేకువజామున 2 నుండి 4 గంటల వరకు తిరుపాల్లచ్చితో స్వామివారిని మేల్కొలిపి, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉదయం 4 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఉదయం 10 గంటలకు ఉత్సవర్లకు అభిషేకం, సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

అదేవిధంగా తిరుపతిలోని గోవిందరాజస్వామివారి ఆలయం, కోదండరామాలయం, చంద్రగిరిలోని కోదండరామాలయం, కార్వేటినగరంలోని వేణుగోపాలస్వామివారి ఆలయం, పిఠాపురంలోని పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయం, కీలపట్ల కోనేటిరాయస్వామివారి ఆలయం, బెంగుళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, అమరావతిలలో వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


Next Story