పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో చిరుత పులుల సంచారం ఎక్కువ కావడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా తిరుమలలో మరో చిరుత చిక్కింది. తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో టీటీడీ ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. కొన్ని రోజుల కిందట కాలి నడక మార్గంలో కొండపైకి వెళ్తున్న భక్తుల్లో ఓ చిన్నారి లక్షితపై పులి దాడి చేసి చంపేసింది. ఈ ఘటన జరిగిన ప్రదేశానికి దగ్గర్లోనే టీటీడీ అటవీశాఖ అధికారులు పులి కోసం బోను ఏర్పాటు చేశారు.
ఇవాళ బుధవారం తెల్లవారు జామున ఓ చిరుత చిక్కింది. చిరుతను తిరుపతిలోని జూపార్క్‌కు తరలించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది అటవీశాఖ. వారం రోజులుగా చిరుత సంచారంపై నిఘా పెట్టిన అధికారులు పలు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున చిరుత బోనులో పడింది. దీంతో ఇప్పటివరకు ఆరు చిరుతలను బంధించినట్లు అధికారులు వెల్లడించారు. వాటిలో రెండు చిరుతలను అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు.