తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి సోమవారం తెలిపారు.
By అంజి Published on 12 Sept 2023 7:18 AM IST
తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి సోమవారం తెలిపారు. వెలగపూడిలోని సచివాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. కన్వర్జెన్స్ విధానంలో యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, పరిశ్రమలు, సంస్థల సమన్వయంతో వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రభుత్వం ఇప్పటికే 26 నైపుణ్య శిక్షణ కళాశాలలను నడుపుతోందని తెలిపారు.
దీంతోపాటు గిరిజన ప్రాంతాలతోపాటు 192 చోట్ల వివిధ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. యువతకు నాణ్యమైన నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగాలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ లక్ష్య సాధనకు పరిశ్రమలు, ఇతర భాగస్వాములతో సమన్వయంతో పని చేయాలని అధికారులను కోరారు. సమావేశంలో విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్, స్కిల్ ట్రైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈవో వినోద్‌కుమార్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్, చేనేత జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.సునీత, పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, పరిశ్రమలశాఖ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.