తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని తరించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తిరుపతిలో జరిగే 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు అమిత్ షా తిరుపతికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే అమిత్‌షాతో పాటు సీఎం వైఎస్ జగన్ స్పెషల్ కాన్వాయ్‌లో తిరుమల చేరుకున్నారు. అనంతరం పద్మావతి గెస్ట్ హౌస్ దగ్గర అమిత్ షాను దిగబెట్టారు. ఆ తర్వాత సీఎం వైఎస్ జగన్ శ్రీకృష్ణ గెస్ట్ హౌస్‌కు వెళ్లారు. సంప్రదాయ పంచకట్టుతో సీఎం జగన్ అమిత్ షా కలిసి ఒకే కారులో శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. వారికి తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కె.ఎస్.జవహర్ రెడ్డి, వేదపండితులు స్వాగతం పలికారు.
ధ్వజస్తంభాన్ని దర్శించుకుని వెండి వాకిలి ద్వారా అమిత్ షా, వైఎస్ జగన్‌లు ఆలయంలోకి ప్రవేశించారు. వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత విమాన వెంకటేశ్వరస్వామికి నమస్కరించి హుండీలో కానుకలు వేశారు. రంగనాయకుల మండపంలో అమిత్‌షా, వైఎస్ జగన్‌లకు వేద పండితులు అశీర్వచనాలు పలికారు. టీటీడీ చైర్మన్, ఈవోలు శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను, టీటీడీ అగరబత్తులు, క్యాలెండర్, 2022 డైరీని అందించారు. రాష్ట్రానికి అన్ని విధాల మేలు జరిగేలా శక్తిని ఇవ్వాలని శ్రీవారిని వేడుకున్నట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు.