తిరుమల రెండో ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణీకులతో కొండపైకి వెలుతున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి గోడను ఢీ కొట్టింది. భాష్యకారుల సన్నిధి సమీపంలో ఈ ఘటన జరిగింది. జీపు, బైక్‌ను తప్పించబోయిన క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రి తరలించి చికిత్స అందించారు. ప్రయాణీకులను ఇంకో బస్సులో తిరుమలకు తీసుకువెళ్లారు. క్రేన్లను తీసుకువచ్చి బస్సును బయటకు తీశారు. ఒకవేళ బస్సు మరో వైపు వెళ్లి ఉంటే లోయలో పడి ఉండేదని, బస్సు డ్రైవర్ చాకచక్యంతోనే ఈ ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. ఈ ఘటనలో ఎవ్వరికి పెద్దగా గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదిలా ఉంటే.. తిరుమల శ్రీవారిని నిన్న 65,633 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,352 మంది తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3.68 కోట్లు వచ్చింది. ప్రస్తుతం 14 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనానికి 19 గంటల సమయం పడుతోంది.