అగ్నిలో వికసించిన పుష్పం 'ఇస్బెల్లా'
By మధుసూదనరావు రామదుర్గం Published on 18 July 2020 5:29 PM ISTఆదాయం సున్నా, వంటినిండా అనారోగ్యం, కడుపును నకనకలాడిస్తున్న ఆకలి మంటలు, దరిద్రానికి కేరాఫ్ అడ్రస్ గా ఇల్లు.. ఇన్ని ఆటంకాలున్నా, అవాంతరాలున్నా, నిత్యం పేదరికంతో పోరాడుతున్నా 18 ఏళ్ల ఆ అమ్మాయిది మాత్రం వజ్ర సంకల్పం. అనుకున్నది సాధించాలన్న కసి.. తనలో జ్వలించే విద్యా ఆకాంక్షను సాధించడానికి తనను తాను ఎండబెట్టుకుంది. కష్టాలు ఎన్ని వచ్చినా పంటి బిగువున ఓర్చుకుంది.. అయితే పట్టు సడలనీయలేదు. తిరుచ్చీకి చెందిన గార్బియల్ ఇస్బెల్లా సమస్యలు తనను ముట్టడించినా ఏమాత్రం జారిపోలేదు. విధికి ఎదురుతిరిగి పోరాడింది. దరిద్రాగ్నిలో వికసించిన పుష్పంలా విజేతగా నిలిచింది. 12వ క్లాసులో ఎలాగైనా సరే 600 మార్కులకు గాను 470 సాధించాలనుకుంది. అహోరాత్రులు కష్టపడి తాను అనుకున్నది చేసి చూపించింది. ఇస్బెల్లాకు ఈ విజయం అయాచితంగా అంత సులువుగా దొరకలేదు. చిన్నవయసులోనే కష్టాలు ఎలా కాలుస్తాయో అనుభవంతో తెలుసుకుంది. ఆకలి అంటే ఏంటో తెలుసు. అన్నం విలువ తెలుసు. అందుకే తన విజయాన్ని ఆనందంగా ఆస్వాదిస్తోంది.
ఇస్బెల్లా పుట్టి కన్ను తెరచీ తెరవక ముందే మూడునెలల వయసులోనే తండ్రి కాలం చేశాడు. అప్పటి నుంచి తల్లి తండ్రీ తనే అయి ఇస్బెల్లాను కన్నతల్లి కడుపులో పెట్టుకుని పెంచింది. అయితే దుర్భర దారిద్ర్యం వెంటాడుతుండటంతో ఇస్బెల్లా పసి వయసునుంచే పడరాని పాట్లు పడింది. తల్లి కాంట్రాక్ట్ కూలీగా శ్రమిస్తూ నెలక రూ. 6వేలు సంపాదించేది. దాంతోనే ఇల్లు గడవాలి.. ఇస్బెల్లా చదువు సాగాలి ఎలా? తన కూతురు ఎలాగైనా పెద్ద చదువు చదివేలా చేయు దేముడా అని రోజూ ప్రార్థించేది.
అయితే పులి మీద పుట్రలా తల్లి తీవ్ర అనారోగ్యం వల్ల కూలీకి వెళ్లడం చేతకాక రెండేళ్ల నుంచి ఇంటికే పరిమితమై పోయింది. ఇంకేముంది వచ్చే ఆ చిరు ఆదాయానికి గండి పడింది. చేతిలో చిల్లి గవ్వ లేని దుస్థితి. నేను చిన్ననాటి నుంచే దుర్భర దారిద్ర్యం ఎలా ఉంటుందో కళ్లారా చూశాను. రోజుకు ముగ్గురం భోంచేసేంత ఆదాయం కూడా లేని కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాను. 8వ క్లాసు చదువుతున్నప్పుడు ఇక చదువుకు స్వస్తి పలకాల్సిందే అనుకున్నాను. కానీ ఆత్మీయులు, బంధువులు, కష్టాలను అర్థం చేసుకున్న స్నేహితుల పుణ్యమా అని ఇంతదాకా చదవగలిగాను.. అంటూ ఇస్బెల్లా చెబుతన్నప్పుడు ఆమె కళ్లల్లో సన్నటి కన్నీటి పొర.. గొంతులో ఏదో తెలీని భావోద్వేగం కనిపించాయి.
బోర్డు పరీక్షలు రాసేముందు ఇస్బెల్లా కోసం ఆమె తల్లి పస్తులుండేది. ఇద్దరు తినాలంటే కుదరని గడ్డు పరిస్థితుల్లో కూతురు పరీక్షలు బాగా రాయాలని తన కడుపును మాడ్చుకోవాల్సి వచ్చింది. ఉన్న కష్టాలు చాలవన్నట్లు ఇస్బెల్లా కడుపులో అల్సర్లు వచ్చాయి. నరకయాతన అంటే ఇదేనేమో! తమిళం పరీక్ష రాసే రోజు రక్త వాంతులయ్యాయి. డాక్టర్ కు చూపితే పండ్లు తినాల్సిందిగా సూచించాడు. అన్నమే దొరకని పేదకు పండ్లు ఫలహారాలు సాధ్యమా? నేను చివరి సారిగా పండు ఎప్పుడు తిన్నానో తెలీదు. దాని రుచే గుర్తులేదు అని ఆ అమ్మాయి అమాయకంగా అందంటే విధి ఎంత క్రూరమో అనిపిస్తుంది. వారి దుస్థితి తలచుకుంటేనే వళ్లు గగుర్పొడుస్తుంది. కానీ తప్పదు వంట్లో రోగం ఉన్నా లక్ష్యం గురి తప్పరాదన్న సందర్భం. అందుకే ఇస్బెల్లా ఏదైతే అదయింది పరీక్ష రాయడం మాత్రం వదలే ప్రసక్తే లేదని మనసులో నిశ్చయించుకుంది.
ఇస్బెల్లాకు పండ్లు కొనేందుకే ఆ కుటుంబం ఇతరుల ముందు అప్పు కోసం చేయి చాచాల్సి వచ్చింది. ఇస్బెల్లా పరీక్షలప్పుడు రోజూ ఓ పండుముక్క తినేది. అయితే ఇన్ని కష్టాలు వచ్చినా ఆమె ఏమాత్రం కుంగి పోలేదు. రోజూ ఎనిమిది గంటలు కచ్చితంగా చదివేది. పరీక్షలో తుక్కురేపి అత్యధిక మార్కులు సాధించాక ఇస్బెల్లా కన్నా ఆమె తల్లి ఆనందానికి అవధుల్లేవు. అప్పటిదాకా పడిన కష్టాన్నంతా క్షణాల్లో మర్చిపోయింది. కూతురు విజయాన్ని మనసారా ఆస్వాదించింది.
మార్కులు సాధించిన దానికన్నా అమ్మ నాకోసం ఆరోజు చికెన్ బిర్యానీ వండటం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి స్పెషల్ తిండి తిని ఎన్నేళ్లయిందో కదా ఈ అపురూప క్షణాల్ని నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను అంటూ ఇస్బెల్లా సజల నేత్రంతో పలికింది. తిరుచ్చిలోని హోలీ క్రాస్ లో డిగ్రీ చదువుతా, తర్వాత ఏదో ఒకరోజు బ్యాంకు మేనేజరు కావలన్నదే నా కోరిక అంటూ తన మనసులో మాట బైటపెట్టింది ఇస్బెల్లా.
తను ఈ స్థితికి చేరుకోడానికి తల్లిదండ్రుల కష్టం, అయినవారి ఇష్టం అన్నీ ఒదిగి ఉన్నాయి. తన బంధువులకు, స్నేహితులకు, అందరికీ ఈ విజయం ఓ తీపి కానుకగా అభివర్ణించింది. కష్టాలు ఇబ్బందులు వెంటపడి తరుముతున్నప్పుడు చేతులెత్తేస్తే చరిత్రలో మనం అనామకులం.. ఎదురు తిరిగి సాహసంతో పోరాడితే మనమే చరిత్ర కారకులం.. ఇస్బెల్లా అనుభవం చెబుతున్న సారాంశం ఇదే. ఇదే సత్యం ఇదే నిత్యం!!