టిక్ టాక్ రేటింగ్ మరింత దిగజారిపోయెనే..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 May 2020 6:54 AM GMTటిక్ టాక్.. టైమ్ పాస్ కోసం విపరీతంగా వాడే వాళ్లు. కొందరు తమ ట్యాలెంట్ ను చూపించడానికి టిక్ టాక్ ను ఉపయోగిస్తే.. మరికొందరు అనవసరమైన వాటికి ఉపయోగిస్తూ ఉంటారు. టిక్ టాక్ లో ట్యాలెంట్ చాలా ఎక్కువ వుంది.. యుట్యూబ్ లో పెద్దగా ఉండదు అని అన్న టిక్ టాకర్ కు క్యారీ మినాటి అనే యూట్యూబర్ తనదైన శైలిలో రోస్ట్ చేశాడు. టిక్ టాక్ కు యూట్యూబ్ కు వార్ అంటూ మొదలైంది సోషల్ మీడియాలో యుద్ధం. ఈ ప్రభావం చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ పై భారీ ప్రభావం చూపింది. టిక్ టాక్, టిక్ టాక్ లైట్ యాప్స్ అన్నీ ఒక స్టార్ కు చేరుకున్నాయి. కరోనా వైరస్ చైనా కారణంగా వచ్చిందని భావిస్తున్న వాళ్లు కూడా టిక్ టాక్ యాప్ కు కేవలం ఒక స్టార్ రేటింగ్ మాత్రమే ఇస్తూ వస్తున్నారు.
ప్లే స్టోర్ లో కొద్దిరోజుల కిందట 4.5 స్టార్ రేటింగ్ తో ఉన్న టిక్ టాక్ యాప్ ఇప్పుడు 1.2 కు చేరింది. అన్ని బిలియన్ల డౌన్ లోడ్స్ ఉన్న ఒక యాప్ కు ఇంత తక్కువ రేటింగ్ రావడం.. ఇదే తొలిసారి. యాపిల్ యాప్ స్టోర్ లో కూడా 4.5 స్టార్ రేటింగ్ నుండి 3.5 స్టార్ రేటింగ్ కు చేరింది.
#IndiansAgainstTikTok అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ ఉండడం కూడా టిక్ టాక్ రేటింగ్ భారీగా తగ్గిపోవడానికి కారణమైంది. యూట్యూబర్లు, మీమర్స్ కూడా యాప్ రేటింగ్ తగ్గించేలా పోస్టులు పెడుతూ ఉన్నారు. దీంతో గూగుల్ ప్లే స్టోర్ లో 1 స్టార్ రివ్యూస్ కుప్పలుతెప్పలుగా వస్తూ ఉన్నాయి.
యూట్యూబర్ క్యారీ మినాటి టిక్ టాక్ చేస్తున్న వాళ్ళను రోస్ట్(విమర్శిస్తూ) చేస్తూ వీడియోను పెట్టాడు. అది 75 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. కొందరు టిక్ టాకర్స్ ఆ వీడియో మీద కంప్లైంట్ ఇవ్వడంతో యూ ట్యూబ్ నుండి వీడియోను తీసేశారు. దీంతో అప్పటి నుండి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో టిక్ టాక్ బ్యాన్ చేయాలి, భారత్ లో టిక్ టాక్ అవసరం లేదు అంటూ ఒక్క స్టార్ రేటింగ్ మాత్రమే ఇవ్వడం.. పలు మీమ్స్ పేజీలు కూడా టిక్ టాక్ బ్యాన్ చేయమని కోరడంతో చాలా మంది వన్ స్టార్ రేటింగ్ ఇస్తూ.. చివరికి 1.2 రేటింగ్ కు టిక్ టాక్ ను తీసుకుని వచ్చారు.
ఇలాంటి సమయంలోనే టిక్ టాక్ లో మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్న ఫైజల్ సిద్ధిఖీ మహిళలపై యాసిడ్ అటాక్స్ విషయంలో అభ్యంతకరమైన వీడియో తీశాడు. అది పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీయడంతో టిక్ టాక్ సంస్థ ఆ వీడియోను తీసేసి.. ఫైజల్ అకౌంట్ ను బ్యాన్ చేసింది. ఆ వీడియో పట్ల రాజకీయనాయకులు, మూవీ స్టార్స్, పలువురు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. దీంతో టిక్ టాక్ మీద మరింత ఆగ్రహం చెందిన యువత 1 స్టార్ రేటింగ్ ను ఇస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్ లో 1 రేటింగ్ తెచ్చుకున్న చాలా యాప్స్ ను గతంలో తీసేశారు. ఇప్పుడు టిక్ టాక్ విషయంలో ప్లే స్టోర్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.