'టిక్‌టాక్'‌ నిషేధంపై స్పందించిన 'టిక్‌టాక్‌ ఇండియా'

By సుభాష్  Published on  30 Jun 2020 2:44 PM IST
టిక్‌టాక్‌ నిషేధంపై స్పందించిన టిక్‌టాక్‌ ఇండియా

దేశంలో చైనాకు సంబంధించిన టిక్‌టాక్‌తో సహా 59 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ ఇండియా మంగళవారం ఓ ప్రకటన జారీ చేసింది. డేటా ప్రైవసీ, సెక్యూరిటీ విషయంలో భారత చట్టాలకు లోబడి ఉన్నట్లు టిక్‌టాక్‌ ఇండియా పేర్కొంది. భారతీయ యూజర్లకు సంబంధించిన సమాచారాన్ని ఇతర విదేశీ ప్రభుత్వాలతో షేర్‌ చేసుకోలేదని స్పష్టం చేసింది. చైనా ప్రభుత్వానికి కూడా తమ సమాచారాన్ని ఇవ్వలేదని పేర్కొంది. ఒకవేళ ఎవరైనా భవిష్యత్తులో సమాచారం కోరినా.. దానిని మేమే వ్యతిరేకిస్తామని తెలిపింది.

భారత్‌కు క్లారిటీ ఇచ్చేందుకు తమకు ఆహ్వానం అందింది

కాగా, టిక్‌టాక్‌పై నిషేధం విధించిన నేపథ్యంలో ఈ అంశంపై భారత ప్రభుత్వానికి వివరణ ఇచ్చేందుకు తమకు ఆహ్వానం వచ్చినట్లు ఆ సంస్థ పేర్కొంది. యాప్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం అందిందని, వివరణ ఇవ్వాలని తమను కోరినట్లు టిక్‌టాక్‌ ఇండియా హెడ్‌ నిఖిల్‌ గాంధీ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే టిక్‌టాక్‌ యాప్‌ ఇండియాలో 14 భాషల్లో అందుబాటులో ఉంది. షార్ట్‌ వీడియో సర్వీస్‌ ను భారత్‌కు చెందిన లక్షలాది మంది వినియోగిస్తున్నారు. టిక్‌టాక్‌, యూసీ బ్రౌజర్‌, వీచాట్‌, షేర్‌చాట్‌, కామ్‌స్కానర్‌ లాంటి చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధం విధించింది. భారతీయ సమగ్రతను దెబ్బతీసే విధంగా యాప్‌లు ఉన్నాయని భారత్‌ ఆరోపించించింది.

130 కోట్ల ప్రజల డేటా ప్రమాదంలో పడకుండా ఉండేందుకు చర్యలు: భారత్

కాగా, భారత్‌ - చైనా సరిహద్దుల్లో సైనికుల ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు వీరమణ పొందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చైనాపై భారత్‌ రగిలిపోతోంది. చైనాకు సంబంధించిన ఎన్నో యాప్స్‌ భారత్‌లో వాడుతున్నందున వాటిని నిషేధించాలనే ఆలోచనకు వచ్చింది. భారత్‌లో చైనాకు సంబంధించిన 59 యాప్స్‌ లు ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. దీంతో పాటు చైనాకు సంబంధించిన యాప్స్‌ నిషేధించాలని డిమాండ్‌ కూడా పెరిగింది. ఆ దిశగానే అడుగులు వేసిన కేంద్రం.. 59 చైనా యాప్‌లను నిషేధిస్తున్నట్లు సోమవారం రాత్రి భారత్‌ ప్రకటించింది.

అలాగే దేశ సమగ్రతకు ఈ యాప్‌లతో ప్రమాదం పొంచివుందని, 130 కోట్ల మంది డేటా ప్రమాదంలో పడకుండా ముందస్తుగా ఈ చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేసింది. చైనా యాప్‌ల ద్వారా భారతీయుల డేటా చోరీ అవుతోందని ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత్‌ వివరించింది

Next Story