తెలుగు సినిమా షేకై మూడేళ్లు.!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Aug 2020 9:17 AM GMTతెలుగు సినిమాలో ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ గురించి మాట్లాడినపుడల్లా ‘శివ’ ప్రస్తావన వస్తుంది. అప్పటిదాకా ఉన్న ఒక మూస ధోరణిని బ్రేక్ చేస్తూ.. ఫిలిం మేకింగ్‌లో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చిన సినిమా అది. ఇలా కూడా సినిమా తీయొచ్చా.. ఓ కథను ఇలా కూడా నరేట్ చేయొచ్చా.. హీరో పాత్రను ఇలా కూడా డిజైన్ చేయొచ్చా.. అని విస్మయానికి గురి చేసిన సినిమా అది.
ఆ చిత్రం తెలుగు సినిమా మీదే కాదు.. మొత్తంగా భారతీయ సినీ పరిశ్రమ మీదే ఎంతో ప్రభావం చూపించింది. మళ్లీ తెలుగులో ఈ స్థాయిలో ప్రభావం చూపిన సినిమా ఏదైనా ఉందీ అంటే.. అది ‘అర్జున్ రెడ్డి’నే అని చెప్పాలి. ‘శివ’ లాగా ఇది పెద్ద రేంజ్ సినిమా కాదు. అందులో స్టార్ హీరో నటించలేదు. హీరోగా తొలి అడుగులు వేస్తున్న విజయ్ దేవరకొండను పెట్టి.. సందీప్ రెడ్డి వంగ అనే కొత్త దర్శకుడు.. చాలా పరిమిత బడ్జెట్లో తీసిన సినిమా ఇది. ఈ సంచలన సినిమా విడుదలై మంగళవారానికి మూడేళ్లు పూర్తయ్యాయి.
‘శివ’ లాగా ‘క్లీన్’ మూవీ కాకపోవచ్చు. దీని చుట్టూ అనేక వివాదాలు నెలకొని ఉండొచ్చు. ఈ సినిమాలో హీరో పాత్ర, కొన్ని సన్నివేశాలు, డైలాగుల పట్ల అభ్యంతరాలు వచ్చి ఉండొచ్చు. కానీ ఇదొక పాత్ బ్రేకింగ్ మూవీ అనడంలో సందేహం లేదు. ‘శివ’ అప్పట్లాగే ఇలా కూడా సినిమా తీయొచ్చా.. ఓ కథను ఇలా కూడా నరేట్ చేయొచ్చా.. హీరో పాత్రను ఇలా కూడా డిజైన్ చేయొచ్చా అనిపించిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’.
వివాదాలతోనే ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించినప్పటికీ.. సినిమా చూసిన జనాలు మామూలుగా షాకవ్వలేదు. ఇటు హీరోగా విజయ్ దేవరకొండ, అటు దర్శకుడిగా సందీప్ విశ్వరూపమే చూపించారీ చిత్రంలో. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ సంచనలాల గురించి ఎంత చెప్పినా తక్కువే. రూ.4 కోట్ల బడ్జెట్లో తెరకెక్కి పది రెట్లకు పైగా ఆదాయాన్ని తెచ్చిపెట్టిందా సినిమా. తర్వాత తమిళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా రీమేకైంది.
తమిళ వెర్షన్ ప్రభావం పెద్దగా లేదు కానీ.. హిందీలో మాత్రం ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. అక్కడా బ్లాక్‌బస్టర్ అయింది. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత ఆ స్టయిల్లో చాలా సినిమాలు వచ్చాయి కానీ.. అవేవీ దానికి దరిదాపుల్లోకి రాలేదు. కానీ ఇటు ప్రేక్షకులు, అటు ఫిలిం మేకర్స్ ఆలోచనల్ని మాత్రం ఎంతగానో ప్రభావితం చేసింది ‘అర్జున్ రెడ్డి’.