కర్ణాటకలో దారుణం.. ముగ్గురు పూజారుల దారుణ హత్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Sept 2020 3:50 PM IST
కర్ణాటకలో దారుణం.. ముగ్గురు పూజారుల దారుణ హత్య

కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ ఆలయంలో నిద్రిస్తున్న పూజారులను దుండగులు దారుణంగా హతమార్చారు. అనంతరం.. ఆలయ హుండీల్లోని నగలు, నగదు ఎత్తుకెళ్లగా.. చిల్లర నాణెలను మాత్రం వదిలివేశారు. పూజారుల హత్యలు సంచలనంగా మారాయి.

వివరాల్లోకి వెళితే.. మాండ్యా జిల్లాలోని గుత్తాలు శ్రీ అరకేశ్వర ఆలయంలో గణేష్, ప్రకాష్, ఆనంద్ పూజారులుగా పనిచేస్తున్నారు. ఈ ముగ్గురు వరుసకు సోదరులు అవుతారు. నిత్యం ఆలయంలో పూజలు నిర్వహిస్తూ.. రాత్రి గుడిలో నిద్రిస్తుంటారు. అదే విధంగా గురువారం కూడా ఆలయంలో నిద్రించారు. శుక్రవారం ఉదయం గుడికి వచ్చిన వారు తలుపులు తెరిచి చూడగా.. ముగ్గురు విగతజీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాత్రి గుర్తు తెలియని దుండగులు పూజరుల తలలపై బండరాళ్లతో మోది హతమార్చినట్లు గుర్తించారు. ఆలయంలోని హుండీలను పగలకొట్టి.. అందులోని నగలు, నగదు దోచుకెళ్లారు. చిల్లర నాణెలను అక్కడే వదిలి వెళ్లారు.

కాగా.. ముగ్గురు కూడా నిద్రలోనే చనిపోయినట్లు పోలీసులు బావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశామని, నిందితుల కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టిన మాండ్య ఎస్పీ పరశురాం తెలిపారు.. నిందితులను గుర్తించడానికి స్నిఫర్ డాగ్స్ సహాయం తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ఘటనలో మరణించిన ముగ్గురు పూజారుల కుటుంబాలకు కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యెడియరప్ప ఒక్కొక్కరికి రూ .5 లక్షల పరిహారం ప్రకటించారు.

Next Story