భారీ వర్ష సూచన.. హైదరాబాద్‌కు పొంచివున్న ముప్పు
By సుభాష్ Published on 19 Oct 2020 9:28 AM IST
వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. ఐతే... ఇంకా వర్ష సమస్య పోలేదని వాతావరణ అధికారులు తెలిపారు. తాజాగా... మరో వాయుగుండం ముప్పు పొంచి ఉందని తెలిపారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. అందువల్ల వచ్చే మూడ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు
వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇంకా వర్షాలు మరింతగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. తాజాగా మరో వాయుగుండం పొంచివున్ననేపథ్యంలో ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని కారణంగా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ఈ హెచ్చరికలతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్ణయం తీసుకుంది. గత వారం రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా వరదలు, బురదతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక రానున్న వర్ష సూచనలపై నగర వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
కాగా, తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో 2.1 కిలోమీటర్ల నుంచి 5.8 కి.మీ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో సోమవారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనంతో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే కురిసి భారీ వర్షాల కారణంగా భాగ్యనగరమంతా జలమయమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ అంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసిన నీటితో నిండిన ప్రాంతాలే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కరోనాతో సతమతమవుతుంటే.. ప్రస్తుతం వరదలతో సతమవుతున్నారు.
ఇక ఏపీపై కూడా అల్పపీడనం ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. పశ్చిమ బంగాళాఖాతంలో 1.5 కి.మీ ఎ త్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, అల్పపీడనం క్రమంగా తీవ్ర అల్పపీడనం మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల ఈనెల 20 నాటికి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.