రేమల్లిలో తీవ్ర విషాదం : కారు డోర్‌ లాకై ఊపిరాడ‌క ముగ్గురు చిన్నారులు మృతి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Aug 2020 2:02 PM GMT
రేమల్లిలో తీవ్ర విషాదం : కారు డోర్‌ లాకై ఊపిరాడ‌క ముగ్గురు చిన్నారులు మృతి

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స‌ర‌దాగా ఆడుకుంటూ కారులోకి వెళ్లిన ముగ్గురు చిన్నారులు‌ డోర్ లాక్ కావ‌డంతో ఊపిరి ఆడక మృతి చెందారు. బాపుల‌పాడులోని మోహ‌న్‌ స్పింటెక్స్ ఫ్యాక్ట‌రీ క్వార్ట‌ర్స్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

వివ‌రాళ్లోకెళితే.. మోహ‌న్ స్పింటెక్స్ కంపెనీలో ప‌నిచేస్తున్న కార్మికుల పిల్ల‌లు మ‌ధ్యాహ్నం 3గంట‌ల స‌మ‌యంలో ఆడుకుంటూ ఇంటిబ‌య‌ట పార్క్ చేసివున్న కారును ఎక్కారు. తిరిగి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించారు. డోర్ లాక్ కావ‌డంతో బ‌య‌ట‌కు రావ‌డం సాధ్య‌ప‌డ‌లేదు. త‌ల్లీదండ్రులు ఎంత వెతికినా పిల్ల‌లు క‌నిపించ‌లేదు. చివ‌రికి కారులో చూడగా ముగ్గురు పిల్లలు విగ‌త జీవులుగా ప‌డివున్నారు. ఆ స్థితిలో వారిని చూసిన త‌ల్లీదండ్రులు బోరున విల‌పించారు.

పిల్లలు కారులో ఎక్కుతున్న సమయంలోనూ.. అనంతరం ఎవరూ గమనించకపోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని తెలుస్తోంది. స‌మాచారం అందిన వెంట‌నే వీరవల్లి ఎస్ఐ చంటిబాబు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన చిన్నారులు హఫ్సానా(6), యాస్మిన్(6), సుహాన పర్వీన్(6)లుగా గుర్తించారు.

Next Story
Share it