మూడు రాజధానుల ఎఫెక్ట్ .. రేపు ఏపీ బంద్
By సుభాష్ Published on 18 Dec 2019 8:07 PM ISTఏపీలో రాజధానుల రగడ అంతకంతకు పెరిగిపోతోంది. రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనపై ఆగ్రహంతో మండిపోతున్నారు. రోడ్లపైకి వచ్చిన రైతులు నిరసనలు తెలిపారు. గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలో రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో రైతులు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్న ఆలోచనను వెంటనే విరమించుకోవాలని వారు కోరారు.
ఈ నేపథ్యంలో ఆందోళనలు ఉధృతం చేయనున్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో రేపు బంద్ పాటించనున్నట్లు రైతులు తెలిపారు. అలాగే వెలగపూడిలోని సచివాలయం వద్ద రిలే దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు రైతులు. ధర్నాలు, నిరసనలు కూడా కొనసాగించాలని, రైతులతో పాటూ స్థానికులు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొనాలని రైతులు పిలుపునిచ్చారు.