సాంబార్‌ సరస్సులో వేలాది విదేశీ పక్షులు మృతి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Nov 2019 10:53 AM GMT
సాంబార్‌ సరస్సులో వేలాది విదేశీ పక్షులు మృతి

జైపూర్‌ : రాజస్థాన్‌లోని సాంబార్‌ సరస్సులో వేలాది విదేశీ పక్షులు మృత్యువాత పడ్డాయి. సుమారు వెయ్యికి పైగా పక్షులు మృతి చెందాయి. అధికారులు వెయ్యి పక్షులు మృతి చెందాయని చెబుతున్నప్పటికీ స్థానికులు మాత్రం 5 వేల పక్షులు మృతి చెందాయని చెబుతున్నారు.

ప్రతి సంవత్సరం విదేశాల నుంచి వలస వచ్చే రంగు రంగుల పక్షులు.. శీతాకాలం రాగానే సాంబార్‌ సరస్సు వద్దకు చేరుకుని పక్షి ప్రేమికులకు, పర్యాటకులకు కనువిందు చేస్తుంటాయి. పక్షులు ఈ సంవత్సరం కూడా వచ్చాయి. కానీ .. ఇలా వచ్చిన వేలాది పక్షులు మృతి చెందటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

సమచారం అందుకున్న జైపూర్ ఫారెస్ట్ అధికారులు సంఘటన ప్రదేశానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మరణించిన పక్షుల శాంపిళ్లను సేకరించి పరీక్ష కోసం భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ హై సెక్యూరిటీ యనిమల్ డీసీజెస్‌కు పంపించారు. వాటర్‌ శాంపిల్స్‌ను కూడా ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు పేర్కొన్నారు. వైరస్‌ వల్లే పక్షులు చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. అనంతరం ఫారెస్ట్‌ అధికారులు పక్షుల కళేబరాలను తొలగించాలని గ్రామపంచాయతీ సిబ్బందికి ఆదేశించారు.

Next Story