ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవికి న‌టుడు థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వీ రాజీనామా చేశారు. ఈ రోజు ఉద‌యం నుండి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న ఆడియో టేపుల వ్యవహారాన్ని వైసీపీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే ఈ వ్యవహారాన్ని టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి.. సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పృథ్వీ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

ఈ విష‌య‌మై పృథ్వీ సోమాజీగూడా ప్రెస్ క్ల‌బ్‌లో మీడియా సమావేశం నిర్వ‌హించారు. 11 ఏళ్లుగా నేను పార్టీ కోసం పనిచేశానని, పార్టీ అధ్యక్షుడి మాటను గౌరవించి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నేను మాట్లాడింది కేవ‌లం కార్పోరేట్ రైతుల గురించి మాత్ర‌మేన‌ని.. రైతులందరినీ పెయిడ్‌ ఆర్టిస్టులని అనలేదని.. నిజ‌మైన రైతులకు నా క్ష‌మాప‌ణ‌లని అన్నారు.  ఫేక్‌ వాయిస్‌తో తనపై దృష్ప్రచారం చేస్తున్నార‌ని.. ఇటువంటి వార్త‌లు విని క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

గ‌త రెండు రోజులుగా త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌తో నా కుటుంబం, స్నేహితులు ఎంతో బాధపడ్డారని అన్నారు. నేను ఎస్వీబీసీ ఉద్యోగులతో స్నేహంగా ఉన్నాని, పద్మావతి గెస్ట్‌హౌస్‌లో మందు తాగారని దృష్ప్రచారం చేశారని.. దీనిపై ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమని తెలిపారు. న‌న్ను ఎవ‌రు తిట్టినా ఆశిర్వ‌చ‌నాలుగానే భావిస్తాన‌ని..పోసాని నా అన్న‌య్య లాంటివార‌ని అన్నారు. నాపై విజిలెన్స్ అధికారుల ద‌ర్యాప్తు కోరాన‌ని.. న‌న్ను ఎవ‌రూ రాజీనామా చేయ‌మ‌ని కోర‌లేద‌ని.. తానే స్వ‌చ్చందంగా రాజీనామా చేశాన‌ని.. విజిలెన్స్ రిపోర్టు వ‌చ్చిన త‌ర్వాత‌నే తాను తిరిగి ఎస్వీబీసీలో అడుగుపెడ‌తాన‌ని తెలిపారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.