ఆంధ్రప్రదేశ్‌లో 'కరోనా వైరస్‌' లేదు..

By అంజి  Published on  3 March 2020 3:18 AM GMT
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ లేదు..

అమరావతి‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) లేదని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు. కరోనా వైరస్‌ నియంత్రణకు, అది రాష్ట్రంలో వ్యాపించకుండా ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని తెలిపారు. ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, 24 గంటలు అందుబాటులో కంట్రోల్‌ రూమ్‌ నుంచి పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులపై నిరంతర నిఘా పెట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో వైద్య సిబ్బందితో పాటు అన్ని శాఖలను అప్రమత్తం చేశామని తెలిపారు.

విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో పూర్తి స్థాయిలో బాడీ స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహిస్తున్నామని తెలిపారు. కరోనా వైరస్‌ ప్రభావిత దేశాల నుంచి ఇప్పటి వరకు 263 మంది ప్రయాణికులు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారని జవహర్‌రెడ్డి వివరించారు. ప్రస్తుతం వీరందరినీ పరిశీలనలోనే ఉంచామని, వీరిలో 50 మంది వారి వారి ఇళ్లలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు.

211 మందికి 28 రోజుల పరిశీలన పూర్తైందని వివరించారు. అయితే 11 మంది రక్త నమూనాలను ల్యాబ్‌కు పంపగా.. పరీక్షల్లో 10 మందికి నెగిటివ్‌ అని తేలిందన్నారు. మరోకరి శాంపిల్‌కు సంబంధించిన రిపోర్టు రావాల్సి ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ కె.ఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు.

ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో తొలి కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం అధికారింగా ధ్రువీకరిస్తూ సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య ఐదుకు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. దేశంలో తొలి కరోనా వైరస్‌ కేసు కేరళలో నమోదు అయ్యింది.

తెలంగాణలో కరోనా సోకిన వ్యక్తి ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్నాడు. అతని వయసు 24 ఏళ్లు. ఇటీవల దుబాయ్‌ నుంచి అతను బెంగళూరు వచ్చాడు. అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్‌కు వచ్చాడు.

Next Story
Share it