వాళ్ల పిల్లలు ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లల్లో చదవట్లేదా..?: సీఎం జగన్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Nov 2019 8:31 AM GMT
వాళ్ల పిల్లలు ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లల్లో చదవట్లేదా..?: సీఎం జగన్‌

ముఖ్యాంశాలు

  • ప్రతిపక్ష నేతలపై మండిపడ్డ సీఎం వైఎస్‌ జగన్‌
  • ప్రపంచంలో పోటీ పడాలంటే ఇంగ్లీష్‌ తప్పనిసరి: జగన్‌
  • నవంబర్‌ 14న 'నాడు.. నేడు' కార్యక్రమం

విజయవాడ: ప్రతిపక్షాలపై సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు మనవడు ఎక్కడ చదువుతున్నారని ప్రశ్నించారు. వెంకయ్య నాయుడి పిల్లలు, మనవడు ఇంగ్లీష్‌ మీడియంలో చదవలేదా?, సినిమా నటుడు పవన్‌ కల్యాణ్‌ పిల్లలు ఇంగ్లీష్‌ మీడియంలో చదవటం లేదా?. మేం ప్రపంచ స్థాయి కోసం ఇంగ్లీష్‌ మీడియం తెస్తుంటే.. కొన్ని పత్రికలు, చంద్రబాబు, వెంకయ్యనాయుడు, నటుడు పవన్‌ విమర్శలు చేస్తున్నారని సీఎం జగన్‌ విరుచుకుపడ్డారు. జాతీయ విద్య, మైనారిటీల సంక్షేమ దినోత్సవంలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. 2008లో మహానేత వైఎస్సార్‌ నవంబర్‌ 11న అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ దినోత్సవంగా ప్రకటించారు. మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ సుదీర్ఘంగా 1958 నుంచి 11 ఏళ్ల పాటు దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా పని చేశారని సీఎం జగన్‌ గుర్తు చేశారు.

3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో పేదల గుండెచప్పుడు విన్నాను. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 33 శాతం నిరక్షరాస్యులున్నారు. దేశంలో ఇది 27 శాతం మాత్రమే. పేదల కుటుంబాలు తమ పిల్లలను చదివించాలనుకున్నా వారికి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని సీఎం జగన్‌ తెలిపారు. పేదల పిల్లలు విద్యలో రాణించాలనుకుంటున్నారు. అందుకోసం ఇంగ్లీష్‌ మీడియంలో చదవాలని కోరుకుంటున్నారు. ప్రపంచంలో పోటీ పడాలంటే ఇంగ్లీష్‌ తప్పనిసరి. అందుకే మన పిల్లలు ఇంగ్లీష్‌ మీడియమ్‌లో చదవాలని ఆరాడపడ్డానన్నారు. వారం క్రితం దీనికి సంబంధించి జీవో జారీ చేస్తే చాలా మంది పెద్దలు తీవ్రంగా వ్యతిరేకించారని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

మనం ఇంగ్లీష్‌ మీడియంలో చదవకపోవడం వల్ల చాలా నష్టపోయాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్‌ చెప్పుకొచ్చారు. నవంబర్‌ 14న గొప్ప కార్యక్రమం చేపడుతున్నాము. రాష్ట్రంలో 45 వేల స్కూళ్లు ఉన్నాయి. వాటిలో 15 వేల స్కూళ్లలో నాడు-నేడు అనే కార్యక్రమం చేపడుతామని సీఎం జగన్‌ తెలిపారు. ప్రతి స్కూళ్లో బాత్‌రూమ్‌లు, బ్లాక్‌ బోర్డులు, ఫ్యాన్‌లు, ప్రహరీ, మంచినీరు, లైట్లు వంటి అన్ని సౌకర్యాలు ఉండాలన్నారు. నాడు.. నేడు కార్యక్రమంలో మార్పు చేసే స్కూళ్లలో ఇంగ్లీష్‌ ల్యాబ్‌లు కూడా ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియమ్‌ మాత్రమే ఉంటుందన్నారు. వాటిలో తెలుగు, ఉర్దూలో ఏదో ఒక భాష తప్పనిసరి అన్నారు. స్కూళ్ల దగ్గర నుంచి మొదలయ్యే విప్లవాత్మక మార్పులు ఉన్నత విద్య వరకు విస్తరిస్తాము. అవన్నీ కూడా ఉద్యోగాలకు దగ్గరయ్యే విధంగా మార్పులు చేయబోతున్నామని సీఎం జగన్‌ తెలిపారు.

Next Story
Share it