'వందమంది' రేపిస్ట్‌లను ఇంటర్వ్యూ చేసిన మహిళ..!

By అంజి  Published on  8 Dec 2019 11:31 AM GMT
వందమంది రేపిస్ట్‌లను ఇంటర్వ్యూ చేసిన మహిళ..!

ముఖ్యాంశాలు

  • ఇంగ్లండ్ లో క్రిమినాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన మధుమిత పాండే
  • నిర్భయ ఉదంతంతో అత్యాచారం కేసులపై స్టడీ చేయాలన్న ఆసక్తి
  • ఢిల్లీలోనే పుట్టి పెరిగిన రీసెర్చ్ స్కాలర్
  • తీహార్ జైలుకువెళ్లి వందమంది రేపిస్టులను ఇంటర్వ్యూ చేసిన పాండే
  • విస్మయం గొలిపే అంశాలను తెలుసుకున్న మధుమిత
  • త్వరలోనే రీసెర్చ్ లో తెలుసుకున్న అంశాలపై పుస్తక ప్రచురణ

మధుమిత పాండే. 22 సంవత్సరాల వయసున్న ఈ యువతి ఢిల్లీలోని తీహార్ జైలుకు వెళ్లి అత్యాచారం కేసుల్లో శిక్షపడిన ఖైదీలను ఇంటర్వ్యూ చేసింది. గడచిన మూడు సంవత్సరాల్లో ఆమె తన క్రిమినాలజీ డాక్టరేట్ పరిశోధనకోసం వందమంది అత్యాచారం కేసులో శిక్షపడిన నిందితులను ఇంటర్వ్యూ చేసింది. ఇంగ్లండ్ లోని ఏంజెలా రస్కిన్ విశ్వవిద్యాలయంలో క్రిమినాలజీలో పి.హెచ్.డి చేస్తున్న ఈ యువతి నేరస్తులను ఇంటర్వ్యూ చేసి అనేక ఆసక్తికరమైన, విస్మయం గొలిపే అంశాలను తెలుసుకోగలిగింది.

2013లో మధుమిత పైలట్ ప్రాజెక్ట్ చేసింది. ఇందుకోసం ఆమె ఎంచుకున్న ప్రాజెక్ట్ నిర్భయ. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ అత్యాచారం హత్య కేసులకు సంబంధించి నిందితుల మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది మధుమిత. నిజానికి నిర్భయ కేసుతో దేశ వ్యాప్తంగా అత్యాచారం కేసుల గురించి పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయని చెప్పొచ్చు.

దేశ రాజధాని ఢిల్లీ..

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో సినిమా చూసి ఇంటికి తిరిగివెళ్తున్న సమయంలో నిందితులు దారికాచి ఒక మెడికల్ విద్యార్థినిని అత్యంత అమానుషంగా హింసిస్తూ ఆమెపై అత్యాచారం జరిపారు. విధిలేని పరిస్థితిలో దుండగులతో శక్తికొద్దీ పోరాడి ఓడిపోయిన ఆ యువతి అత్యంత దయనీయమైన స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. కేవలం ఆమెపై అతి దారుణంగా, హింసాత్మకంగా అత్యాచారం జరపడంమాత్రమే కాక నిందితులు ఆ యువతిని దారుణాతి దారుణంగా హత్య చేశారు.

జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో చూపుతున్న లెక్కల ప్రకారం 2015లో దేశంలో 34,651 మంది మహిళలపై అత్యాచారం జరిగింది. నిర్భయ ఉదంతంతో దేశంలో ఈ రకమైన నేరాలకు వ్యతిరేకంగా కొంత చలనం వచ్చింది. కోట్లాదిమంది భారతీయులు అత్యాచారాలకు వ్యతిరేకంగా గళమెత్తారు.

ఈ ఘటనతో అత్యాచారం జరిగినప్పుడు గుసగుసలాడుకునే స్థాయినుంచి బహిరంగంగా చర్చించే స్థాయి అవగాహన ప్రజలకు వచ్చింది. 2012లో జెండర్ స్పెషలిస్టులు జి ట్వంటీ దేశాల్లోకెల్లా భారత్ ఏమాత్రం భద్రత లేని దేశమని ప్రకటించారు. సౌదీ అరేబియాలో మహిళలు మగవాళ్ల కనుసన్నల్లోనే జీవించాల్సి ఉంటుంది. ఆఖరికి ఆ దేశంతో పోల్చి చూసినా మహిళలకు కనీస స్వాతంత్ర్యం, భద్రత కరవైన దేశంగా భారత్ అప్రదిష్టను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

భారత్ లో ఒక యువతిపై ఆమె తండ్రే దారుణంగా అత్యాచారం చేశాడు.

గ్రామపెద్దలు ఆ నేరాన్ని కప్పిపుచ్చారు.

ఇలాంటి ఘటనల గురించి తెలుసుకున్నప్పుడు మధుమిత పాండే మనసు కలవర పడింది. ఇంగ్లండ్ లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న ఆమెకు అసలు ఇలా ఎందుకు జరుగుతోందో తెలుసుకోవాలన్న ఆసక్తి మొదలయ్యింది. కనీసం ఇలా జరగకుండా వీసమెత్తైనా ఏమైనా చేయడానికి వీలు లేదా అన్న ప్రశ్న ఆమె మదిలో ఉదయించింది.

అదే క్రిమినాలజీలో ప్రత్యేకంగా ఈ అంశాన్ని ఎంపిక చేసుకుని, అత్యాచారం కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను ఇంటర్వ్యూ చేసి, వారి మానసిక స్థితిని అంచనా వేసి, కనీసం ముందు తరాలకు కొంత మేలు చేయాలన్న తలంపు కలిగింది.

"అసలు మగాళ్లు తాము చేయాలనుకున్న పనిని అంత సులభంగా, ఏమాత్రం భయంలేకుండా ఎలా చేస్తారు? సభ్యసమాజం వాళ్లను మృగాలుగా ఎందుకు పరిగణిస్తోంది? అసలు వాళ్లలో మానవత్వం మచ్చుకైనా మిగలలేదా?" అనే సందేహాలు కలిగాయి. వాటికి సమాధానాన్ని అన్వేషిస్తూ మధుమిత పాండే నేరస్తులను ఇంటర్వ్యూ చెయ్యడం మొదలుపెట్టింది.

మధుమిత పాండే ఢిల్లీలోనే పుట్టి పెరిగింది. నిర్భయ ఉదంతం తర్వాత ఆమెకు ఢిల్లీ చాలా కొత్తగా అనిపించింది. తను పుట్టి పెరిగిన నగరంపట్ల ఆమెకు ఉన్న దృక్పథం మారిపోయింది. దేశ రాజధాని నగరంలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేదా? అన్న బాధ ఆమె మనసును తొలిచేసింది.

క్రిమినాలజీలో డాక్టరేట్..

అసలు ఇలాంటి నేరాలు జరగడానికి కారణాలు ఏమిటో తెలుసుకోవడంవల్ల, ఆ నేరాలకు కారణమైన పరిస్థితులను సమూలంగా నిర్మూలించడంవల్ల కొంతైనా భవిష్యత్ తరాలకు మేలు కలుగుతుందన్న ఆలోచనే ఆమెను క్రిమినాలజీలో డాక్టరేట్ లో ప్రత్యేకంగా ఈ అంశాన్ని ఎంపిక చేసుకునే దిశగా నడిపించాయి.

అప్పట్నుంచీ మధుమిత పాండే కొన్ని వారాలపాటు ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న రేపిస్టులను ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టింది. అలా వివరాలను తెలుసుకోవడంలో మునిగిపోయిన మధుమితకు ఆసక్తికరమైన, విస్మయంగొలిపే కొన్ని విషయాలు తెలిశాయి. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నవారిలో ఎక్కువశాతం మంది నిరక్షరాస్యులు. కొద్దిమందిమాత్రం హైస్కూల్ వరకూ చదువుకున్నవాళ్లు. ఎక్కువశాతంమంది ముడు లేక నాలుగో తరగతిలో చదువుమానేసినవాళ్లు.

వాళ్లను ఇంటర్వ్యూ చెయ్యడానికి వెళ్లినప్పుడు జైలు అధికారులు, సిబ్బందికూడా మధుమితను పెద్దగా ప్రోత్సహించలేదు. అలాంటి మానవ మృగాలతో మాట్లాడడంకూడా వృథా అన్నారు. కానీ మధుమిత పట్టుబట్టి కార్యసాధనలో ముందడుగు వేసింది.

వాళ్లతో మాట్లాడినప్పుడు తెలిసిన ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్లేమీ పూర్తి స్థాయిలో కరుడుగట్టిన నేరస్తులు కారు. అందరిలాగే సాధారణమైన మనుషులే. వాళ్లను ఆ నేరాలు చేయడానికి పురికొల్పినవి నిరక్షరాస్యత, చుట్టూ ఉన్న వాతావరణం, పరిస్థితులు, స్నేహితులు మాత్రమే. కేవలం ఈ నాలుగు కారణాలు మాత్రమే అసలు తాము చేస్తున్న తప్పేమిటోకూడా తెలుసుకోలేని పరిస్థితిలోకి వాళ్లను నెడుతున్నాయని ఆమె అభిప్రాయపడుతోంది.

చాలామంది జడ్జ్ లు అత్యాచారం కేసుల విచారణలో

"బాధితురాలిని పెళ్లి చేసుకుంటావా?" అని నిందితుడిని ఎందుకు ప్రశ్నిస్తారు?

భారత దేశంలో మహిళలు పూర్తి స్థాయిలో సంప్రదాయానికి బద్ధులై ఉంటారు. బాగా విద్యావంతులైనవారిలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. చాలామంది మహిళలు ఇప్పటికీ తమ భర్త పేరును చెప్పడం తప్పుగా భావిస్తారు. మధుమిత దీని గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలనుకుంది.

అందుకోసం ఆమె తన స్నేహితులకు, స్నేహితురాళ్లకు ఫోన్ చేసి మీ అమ్మ మీ నాన్నను ఏమని పిలుస్తుంది అని అడిగింది. "ఇదిగో..! , ఏమండీ.. !, చూశారా.. ! కాస్త వింటారా.. ! రోహన్ నాన్నగారూ.. ! (పిల్లల తండ్రిగా పిలవడం)" లాంటి సమాధానాలు వచ్చాయి.

చాలా కుటుంబాల్లో పురుషులు ఉన్నత స్థాయివారుగానూ, మహిళలు తక్కువస్థాయివారుగానూ భావించడం జరుగుతుంది. దానివల్ల చిన్నతనంనుంచే మహిళపట్ల గౌరవం లేకుండా పోవడం లాంటి భావనలు పిల్లల మనసుల్లో నాటుకుంటాయి. చదువుకున్నవాళ్ల పరిస్థితే ఇలా ఉంటే అసలు చదువే లేనివాళ్ల పరిస్థితి ఎలా ఉంటుంది.

పూర్తిగా ఆడవాళ్లను బానిసలుగా, తక్కువస్థాయివాళ్లుగా పరిగణిస్తారు. అంటే మహిళలను గౌరవించాలన్న భావనలను చిన్నతనంలోనే పిల్లలమనసుల్లో నాటకపోవడం, పెద్దలు మహిళలను గౌరవించడంద్వారా, వాళ్లకు సమస్థాయిని కల్పించడంద్వారా ఆడవాళ్ల గౌరవాన్ని ఇనుమడింపజేయడంలాంటి వ్యవస్థ కరవవుతోందన్నమాట.

నిజానికి భారత దేశంలో..

నిజానికి భారత దేశంలో స్త్రీని తక్కువగా చూడడానికి ఆస్కారం లేని సంస్కారం మెండుగా ఉంది. కానీ దాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలిగిన సంస్కారాన్ని పిల్లల్లో పెంచడానికి ప్రత్యేకంగా ఎలాంటి వ్యవస్థా లేకపోవడంవల్ల పరిస్థితిని, మహిళల స్థాయిని సరిగ్గా అర్థం చేసుకునే స్థితి పిల్లలకు కలగడం లేదు. కొన్నిచోట్ల ఉద్దేశపూర్వకంగా మహిళల్ని కించపరిచే భావజాలం, పదజాలంకూడా ఎక్కువగా ఉండొచ్చు. అలాంటి స్థితిలో పిల్లలకూ అవే అలవాటవుతాయి.

చిన్ననాటినుంచే మహిళలకు గౌరవం ఇవ్వడం, వారిని సమస్థాయిలో ఆదరించడం, పరాయి స్త్రీలను తల్లితో, చెల్లితో సమానంగా భావించడంలాంటి సువ్యవస్థ భారత దేశంలో అనాదిగా ఉంది. కానీ ఆ సువ్యవస్థను ముందు తరాలకు అందించలేకపోవడంవల్లే మహిళలపట్ల సమాజంలో చులకన భావన పెరుగుతోందని చెబుతోందీ రీసెర్చ్ స్కాలర్.

తద్వారా మిగతా కారణాలు కూడా తోడై నేరాలకు పాల్పడే స్థాయి అజ్ఞానాన్నీ, అంథకారాన్నీ, మానసిక ప్రవృత్తినీ, విచ్చలవిడితనాన్నీ, నేరప్రవృత్తినీ, నిర్లక్ష్యాన్నీ, అసలు తాము చేస్తున్న పనేమిటోకూడా తెలుసుకోలేని అత్యంత హీనమైన స్థితినీ కలగజేస్తున్నాయని మధుమిత అభిప్రాయపడుతోంది.

వీటికి తోడు చెడు సావాసాలు పూర్తి స్ధాయిలో ఇలాంటి నేరాలకు ప్రేరేపణ కల్పిస్తున్నాయని ఆమె అంటోంది. ఇలాంటి నేరాలకు పాల్పడేవాళ్లు ఏ పరాయి గ్రహంలోంచో రావడం లేదని, మన సమాజంలోనే, మనతోపాటే తిరుగుతున్న వ్యక్తులే గతి, మతి తప్పి ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు పెంపొందించుకుని తప్పుదోవపడుతున్నారని అంటోంది.

మధుమిత పాండే ఇంటర్వ్యూ చేసినవాళ్లలో కుటుంబ సభ్యులపై అత్యాచారం చేసిన నేరస్తులు కూడా కొందరు ఉన్నారు. వాళ్లను ఆమె ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్లు చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయింది. పశుబలంతోనైనా మహిళలను తమకు లోబడి ఉండేలా చేయాలన్న కసి, తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు మహిళలపై దాడిచేసే ప్రవృత్తి వారిలో కనిపించాయని ఆమె చెబుతోంది.

దాదాపుగా ఆమె ఇంటర్వ్యూ చేసిన వందమంది నేరస్తుల్లో అధికశాతంమందికి అసలు తాము చేసింది పెద్ద నేరం అన్న భావనకూడా లేదనీ, తాము చేసిన పనిగురించి వాళ్లు చాలా తేలికగా మాట్లాడేశారనీ చెబుతోంది. అలాంటి మానసిక స్థితిలో వారిలో పరివర్తన అన్న పదం గురించిన ఆలోచనకూడా కలగడం లేదని ఆమె బాధను వ్యక్తం చేసింది.

పదమూడేళ్ల వయసులో అత్యాచారానికి గురైన మహిళ.

11 సంవత్సరాలపాటు కోర్టులో విచారణ సాగింది.

పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన సరైన అవగాహన కల్పించే వ్యవస్థ లేకపోవడం చాలా పెద్ద లోపమని మధుమిత అభిప్రాయపడుతోంది. నిజానికి సెక్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన పాఠాలను బోధించడంవల్ల అమెరికాలాంటి అగ్రరాజ్యాల్లో ఉన్న పరిస్థితులు భారత దేశంలోనూ తలెత్తుతాయని ఎక్కువమంది భావిస్తున్నారని మధుమిత అంటోంది.

ప్రత్యుత్పత్తి అవయవాలకు సంబంధించిన పదాలను పలకడాన్నికూడా తప్పుగా భావించే పరిస్థితిలో పిల్లలు తమకు నచ్చిన భావనలను తమకు అందుబాటులో ఉన్న మాధ్యమాల ద్వారా ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తారని, దానివల్ల మంచికంటే చెడే ఎక్కువగా ఉంటుందని అంటోంది.

నేరస్తుల పశ్చాత్తాపం..

కొన్ని ఇంటర్వ్యూల్లో నేరస్తులు తాము చేసిన నేరాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారట. కొందరైతే అసలు అత్యాచారమే జరగలేదని బుకాయించే ప్రయత్నమూ చేశారట. కేవలం ముగ్గురు నలుగురు మాత్రం తాము చేసిన పనికి సిగ్గుపడుతున్నామని, పశ్చాత్తాప పడుతున్నామని చెప్పారట. ఎక్కువమంది నేరస్తులు పూర్తిగా బాధితులపైనే కారణాన్ని చూపించే ప్రయత్నం చేశారట.

ఓ 49 సంవత్సరాల వ్యక్తి 5 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి తాను తప్పు చేశానని ఒప్పుకున్నాడట. అలా చేసి ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేశాననీ, జైలునుంచి విడుదలైన తర్వాత ఆ పిల్లనే పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాననీ చెప్పాడట.

ఈ ప్రతి స్పందన చూసి మధుమిత పాండే షాక్ తింది. సదరు ఖైదీనుంచి బాధితురాలి వివరాలను సేకరించిన మధుమిత వాళ్లింటికి వెళ్లిందట. కనీసం నేరానికి పాల్పడిన వ్యక్తి జైల్లో ఉన్నాడన్న సంగతికూడా బాధితురాలి కుటుంబసభ్యులకు తెలియకపోవడం ఆమెను మరింత విస్మయానికి గురి చేసింది.

మధుమిత పాండే తన రీసెర్చ్ వివరాలను ఓ పుస్తకంగా మలచి త్వరలోనే ఒక పుస్తకాన్ని ప్రచురించాలన్న ప్రయత్నంలో ఉంది. కానీ పుస్తకం అచ్చైన తర్వాత తనపై మరో ఫెమినిస్ట్ వచ్చిందన్న ముద్ర పడుతుందన్న భయమూ ఆమెకు లేకపోలేదు. కానీ తన పుస్తకంవల్ల మహిళాలోకానికి మేలు కలగడంతోపాటుగా కొందరు పురుషుల ఆలోచనల్లోనైనా మార్పు వస్తే చాలని ఆమె భావిస్తోంది.

Next Story