చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులకు సంబంధించిన కేసులపై లోక్ సభలో కేంద్రం స్పందించింది. ఈ కేసుల్లో ఎఫ్ఐఆర్‌ నమోదైన 24 గంటల్లోపు ప్రాథమిక విచారణను పూర్తి చేయాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఎఫ్ఐఆర్‌ నమోదవగానే కేంద్రం నిర్దేశించిన ఫామ్‌-బి ప్రకారం స్పెషల్‌ జువెనైల్‌ పోలీస్‌ విభాగం సిబ్బంది ప్రాథమిక విచారణ పూర్తిచేయాలి. ఆ వివరాలను పిల్లల సంక్షేమ సంఘానికి అందచేయాలి. పోక్సో చట్టం 2012 కింద నమోదయ్యే కేసుల విచారణలో అనుసరించాల్సిన నిబంధనలను పేర్కొంటూ మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ బుధవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

అత్యాచారాలు, పోక్సో చట్టం కేసులు గతేడాది డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా 2.4 లక్షలకు పైనే కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయి అని అధికారిక సమాచారం. పలు హైకోర్టుల నుంచి సేకరించిన సమాచారం మేరకు 2019 డిసెంబరు 31 నాటికి పెండింగ్ లో ఉన్న రేప్, పోక్సో చట్టం కేసులు 2,44,001. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ 66,994 పెండింగ్ కేసులతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి.

అయితే పెండింగ్ కేసుల పరిష్కారానికి దేశవ్యాప్తంగా 1023 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు ఏర్పాటుచేయనున్నారు. ఇప్పటికే 195 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు ఏర్పాటయ్యాయి.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.