ఈ దోస్త్‌.. సేవల్లో మస్త్‌..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Aug 2020 10:42 AM GMT
ఈ దోస్త్‌.. సేవల్లో మస్త్‌..!

ఏడడుగులు నడిచి ఏడేడు జన్మాలు తోడుగా ఉంటానని బాసలు చేసిన పెనిమిటి అయిదేళ్ళకే కాలం చేయడంతో అంజలి ఒంటరి అయిపోయింది. ఓ వైపు భర్త లేదన్న బాధ.. మరోవైపు కుటుంబాన్ని ఎలా పోషించాలన్న వేదన.. ఒక్కసారిగా దిక్కుతోచక ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. ఎన్నో కష్టాలు మరెన్నో ఇక్కట్లు.. బైటికి చెప్పుకోలేనివి. ఒకవేళ ఎవరినైనా సాయం అడుగు దామంటే.. ఎలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందోనన్న భయం. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. చీకటి తొలగాల్సిందే వెలుగు రావాల్సిందే.. అంజలీ విషయంలోనూ అదే జరిగింది. ఈ –దోస్త్‌ పేరిట బ్యాంకింగ్‌ సేవల్లో చేరాక అన్నీ క్రమంగా సర్దుకున్నాయి. ప్రస్తుతం అంజలీ ఇంటి వద్ద నుంచే బ్యాంకింగ్‌ సేవలందిస్తోంది.

ఏడాది కిందటి దాకా అంజలీకి రేపు ఏం చేయాలి అనే ప్రశ్న వేధిస్తుండేది. ప్రస్తుతం అలా కాదు తనకంటూ ఓపని, తనకంటకూ ఓ ఆర్థిక వనరు ఉండటంతో శ్రద్ధగా ఈ–దోస్త్‌ పనులు చేసకుంటోంది. పాతికేళ్ల వయసున్న అంజలీ మహారాష్ట్రలోని పథర్థీ గ్రామవాసి. మెట్రిక్యులేషన్‌ చదువుకున్న అంజలీకి చిన్న వయసులోనే పెళ్లయింది. పెళ్లయిన అయిదేళ్లకే భర్త దూరమయ్యాడు. నాలుగేళ్ళ కొడుకు, వృద్ధాప్యంలోని తల్లిదండ్రులే తనకు ఆశ.. ఆసరా అయ్యారు. వారికి అంజలే పెద్ద దిక్కయింది. తన కోసం కాకపోయినా వారి కోసమైనా ఉపాధి వెతుక్కోవాలనుకుంది. పొలం పనులు తప్ప పెద్ద పనులు చేతకాని దుస్థితి. అయితే ఆ పని కూడా నిత్యం ఉండదు. ఉన్నప్పుడే నాలుగు కాసులు కళ్ళ చూసేది.

ఇలాంటి సమయంలోనే అనుకోకుండా ఓ అవకాశం తన తలుపు తట్టింది. సమగ్ర గ్రామీణ పథకం కింద పల్లెల్లో డిజిటల్‌ సేవలు విస్తరింపజేసేందుకు కార్పొరేట్‌ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రాజెక్టు చేపట్టింది. ప్రయోగాత్మకంగా పథర్థీ గ్రామాన్ని ఎంచుకుంది. మామూలుగ అయితే ఆ గ్రామప్రజలు ఎలాంటి బ్యాంకు సేవలు పొందాలన్నా.. అడవిని దాటుకుని పది పదిహేను కిలోమీటర్లు వెళ్ళాలి. రానూపోనూ ఖర్చులు, పైగా బ్యాంకుల వద్ద క్యూలో నిలుచుని పనులు పూర్తి చేసుకోవాలి. ఉదయం బయలు దేరితే మళ్ళీ పల్లె చేరుకోడానికి ఎంత లేదన్నా అయిదారు గంటల సమయం పట్టేది. పల్లె ప్రజలకు ఈ ఇబ్బంది తొలగించేందుకే ఈ–దోస్త్‌ సేవలందించేందుకు ముందుకొచ్చింది. అంజలీ ఈ ప్రాజెక్టుకు ఎంపికయ్యింది. శిక్షణానంతరం ఆధార్‌ ద్వారా చెల్లింపులో తొలి ఈ–దోస్త్‌ గా బాధ్యతలు చేపట్టింది.

అంజలి దినచర్య తెల్లారుజామునుంచే మొదలవుతుంది. ఇంటి పనులు ముగించుకుని వీలైనంత త్వరగా గ్రామంలోకి వెళుతుంది. డిపాజిట్లు కట్టించుకోవడం, సొమ్ము తీసుకోవడం, బిల్లు చెల్లింపుల్లాంటి లావాదేవీలను తొమ్మిది గంటల దాకా నిర్వహించి, బ్యాంకుకు వెళుతుంది. అక్కడ ఈ వివరాలను ఇచ్చి, మళ్ళీ మరుసటి రోజు చెల్లింపులకు సరిపడా నగదు తెచ్చుకుంటుంది. ఈ పని కోసం తన వద్ద ఓ స్మార్ట్‌ఫోన్, ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ ఉంటుంది. ఆధార్‌ కార్డు చూడటం, వివరాలు సరిగా ఉన్నాయో లేవో సరి పోల్చుకోవడం, కావల్సిన సేవలు అందించడం ఇదీ ఆమె ఉద్యోగ తీరు. కరెంటు బిల్లులు, పోన్ల రీచార్జి లాంటి సేవలు అందిస్తోంది. ప్రస్తుతం 800 మందికి ఈ–దోస్త్‌ ద్వారా సేవలందిస్తోంది. రూ.5 వేల వేతనంతోపాటు సేవలపై కమీషన్‌ కూడా అందుతుంది. ఈ కరోనా నేపథ్యంలో దాదాపు రూ.5లక్షల లావాదేవీలు నిర్వహించింది. ‘డబ్బు వ్యవహారం కాబట్టి మొదట్లో సందేహించిన మాట వాస్తవమే! అయితే ధైర్యంతో పనిలో దిగాక, అంతా సులువనిపిస్తోంది. గ్రామ ప్రజల సహకారం బాగా ఉంటోంది’ అంటూ సంతృప్తిగా చెబుతుంది అంజలి.

మొదట్లో గ్రామ ప్రజలు పట్టించుకోకున్నా.. క్రమంగా తమ అవసరాలు తీరుతున్నట్టు గ్రహించి అంజలి వద్దకు రావడం సురూ చేశారు. అంతేకాదు అంజలీకి గ్రామంలో మునపటి కన్నా గౌరవం పెరిగింది. చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోడం కాదు.. మనవంతుగా ప్రయత్నించి చిరు దీపమైనా వెలిగించాలి. అదే అంజలి జీవితం చెబుతున్న సత్యం. అంతే కదా గోరంత దీపం కొండంత వెలుగు!

Next Story