'ఇబ్రహీం చెరువు'ను తేల్చాలంటే మూసీని ముంచాల్సిందేనా.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Nov 2019 1:25 PM IST
ఇబ్రహీం చెరువును తేల్చాలంటే మూసీని ముంచాల్సిందేనా.?

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని తెలుగులో ఒక సామెత. మూసీనది విషయంలో ఇప్పుడిది నిజమని తేలుతోంది. శతాబ్దాలనాటి జల వనరులను కాపాడుకోవాలన్న లక్ష్యంతో మొదలుపెట్టిన సంస్కరణలు ఇప్పుడు నిజాం కాలం నాటి ఇబ్రహీం చెరువును కాపాడేందుకు ఉపకరిస్తున్నాయి. నిజానికి ఇది చాలా మంచి విషయమే. కానీ ఇక్కడే ఒక చిక్కొచ్చిపడింది.

ఇబ్రహీం చెరువును కాపాడుకోవాలంటే మొత్తంగా చుట్టుపక్కల ప్రాంతాలనుంచి వెలువడుతున్న మురుగునీటికి పూర్తిగా మూసీలోకి తరలించడంతప్ప మరోమార్గం లేదంటున్నారు నిపుణులు. అంటే ఇప్పటికే దుర్గంధభూయిష్టంగా మారిన మూసీకి మరింత మురుగు తప్పదన్నమాట. ఈ అంశం గురించి లోతుగా విశ్లేషించి, సరైన సమాచారాన్ని సూటిగా తెలిపే తెలుగు న్యూస్ మీటర్ కథనం ఇది.

నిజాం నవాబు ఇబ్రహీం కుతుబ్ షా పాలనలో భాగ్యనగరంలో తవ్విన మంచినీళ్ల చెరువు ఇబ్రహీం చెరువు. చాలాకాలంపాటు ఈ చెరువు ఈ ప్రాంతవాసులకు మంచినీటి వనరుగా ఉంది. నగరవాసులకు తియ్యటి స్వచ్ఛమైన మంచినీటిని అందించింది. కానీ కాలక్రమంలో ఈ చెరువు తీవ్రస్థాయిలో ఆక్రమణలకు గురయ్యింది. చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు తమ ఇళ్లనుంచి వచ్చే మురుగునీటిని నేరుగా ఈ చెరువులోకి మళ్లించడం మొదలుపెట్టారు.

దీనివల్ల చెరువులోని నీరు పూర్తిగా పాడైపోయి, కాలుష్యం చుట్టుముట్టి ఇబ్రహీం చెరువు చచ్చిపోవడం మొదలయ్యింది. 1976 నుంచి 2019 వరకూ చెరువు ఏ విధంగా ఆక్రమణలకు, మురుగునీటికి, వ్యర్థాలకూ చిరునామా అయ్యిందో తెలిపే ఉపగ్రహచిత్రాలను తెలుగు న్యూస్ మీటర్ మీకు అందిస్తోంది.

ప్రస్తుత పరిస్థితి ఏంటంటే.. కొన్ని స్వచ్ఛంద సంస్థలు అనేక సంవత్సరాలుగా స్థానికంగా ఉన్న జలవనరుల సంరక్షణకు నడుం బిగించాయి. ఈ సంస్థలు చేస్తున్న గట్టి ప్రయత్నంవల్ల ఇబ్రహీం చెరువు బతికి బట్టకట్టే పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం గురించికూడా మనం తెలుసుకోవాలి. ఇబ్రహీం చెరువును కాపాడాలంటే చుట్టుపక్కల ప్రాంతాలనుంచి వస్తున్న మురుగునీటిని పూర్తిగా మూసీలోకి మళ్లిస్తేనేగానీ ఆశించిన ఫలితాలు కనిపించవు.

ఇలాగే దుర్గం చెరువును, మల్కం చెరువును గతంలో కాపాడుకోవడం జరిగింది. వాటిలోకి విడిచిపెడుతున్న మురుగునీటిని, వ్యర్థాలను పూర్తిగా ఇబ్రహీం చెరువులోకి మళ్లించారు. అప్పటివరకూ ఇబ్రహీం చెరువు పూర్తిగా మంచినీటి చెరువుగానే ఉండేది. సరిగ్గా అప్పటినుంచే అది మురికికూపంగా మారిపోయింది.

మణికొండ, లంకాపురం ప్రాంతాలు అభివృద్ధిచెందడం మొదలైన దగ్గరినుంచీ ఇబ్రహీం చెరువుకు కష్టాలొచ్చిపడ్డాయి. నిజానికి స్థానికంగా వచ్చే మురుగుకంటే, వ్యర్థాలకంటే దుర్గంచెరువులోకి, మల్కం చెరువులోకి చేరే వ్యర్థాలను ఇబ్రహీం చెరువులోకి మళ్లించినందువల్ల ఏర్పడిన కాలుష్యమే చాలా ఎక్కువ.

దీనికితోడు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ ప్రాంతాలనుంచి కూడా మురుగునీటి వ్యర్థాలు పెద్దఎత్తున ఇబ్రహీం చెరువుకు వచ్చి చేరడం మరో దారుణమైన అంశం. దానివల్ల చెరువులో కాలుష్యం మరింతగా పెరిగిపోయింది. కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టుగా రకరకాల కారణాలు, రకరకాలైన మురుగునీటి కాలుష్యం ఇబ్రహీం చెరువును పూర్తి స్థాయిలో మురికి కాల్వగా మార్చేసింది. మంచినీళ్లు పూర్తిగా మాయమైపోయాయీ చెరువులో.

ప్రముఖ సామాజిక కార్యకర్త, నీటి వనరుల సంరక్షణకోసం పోరాడుతున్న వ్యక్తి సునీల్ చక్రవర్తి, ఇంకా మరికొందరు స్వచ్ఛంద సామాజిక కార్యకర్తలు ఇబ్రహీం చెరువును కాపాడేందుకు నడుం బిగించారు. అనేకసార్లు ఈ ప్రాంతంలో పర్యటించి స్థానికులకు ఆ నీటి వనరు విలువను తెలియజెప్పేందుకు గట్టిగా ప్రయత్నించారు. అనేకమార్లు ఈ విధంగా నచ్చజెప్పిన తర్వాత స్థానికులకు ఈ నీటి వనరు విలువ కొద్దిగానైనా తెలియడం మొదలయ్యింది.

మహిళా దినోత్సవం, గాలిపటాల పోటీలు, 5కె రన్ లాంటి అనేక కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించడంద్వారా స్థానికులకు అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు ఎంతగానో ప్రయత్నించాయి. వేసవిలో అయితే ఇబ్రహీం చెరువుకు కాలుష్యం సమస్య తీవ్రత మరింత హెచ్చుగా ఉండేది. మురుగునీటిని చాలా ఎక్కువ మొత్తంలో ఈ చెరువులో కలపడంవల్ల పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో భూగర్భజలాలుకూడా కలుషితం కావడం మొదలయ్యింది. దోమలకు ఈ చెరువు శాశ్వత ఆవాసమయ్యింది.

అనేక ప్రయత్నాల తర్వాత ప్రభుత్వం స్పందించి రూ.22.5 కోట్ల నిధులను ఇబ్రహీం చెరువు పునరుద్ధరణకు కేటాయించింది. అసలు కథ ఇక్కడే మొదలు. ఈ చెరువును కాపాడాలంటే మురుగునీటికి పూర్తిగా మూసీలోకి మళ్లించక తప్పని పరిస్థితి.

నగరంలో నీటి వనరులను శుద్ధిచేసే యంత్ర పరికరాలేవైనా సరే సవ్యంగా, సమర్థంగా పనిచేసిన దాఖలాలు ఈనాటివరకూ లేవు. మూసీనదిలో పరిస్థితికూడా ఇంతే. దుర్గం చెరువులో కాలుష్యాన్ని, వ్యర్థాలను నిర్మూలించే ప్లాంట్ నామమాత్రంగానే పనిచేస్తోంది తప్ప, ఏర్పాటు చేసిననాటినుంచీ ఈనాటివరకూ దానివల్ల ఒనగూరిన ప్రయోజనం శూన్యం.

స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు అనేకమార్లు అనేక విధాలుగా దాదాపుగా మూడు నెలలకు పైగా స్థానికులకు నచ్చజెప్పడంవల్ల ఇబ్రహీం చెరువుకు అనుసంధానంగా ఉన్న మరో చిన్ననీటి వనరును కాపాడుకునే అవకాశం కలిగింది. దీనిలో పేరుకుపోయిన గుర్రపు డెక్కను, చెత్తను స్థానికులు స్వచ్ఛందంగా తొలగించారు.

ఎండాకాలంలో చెరువు ఎండిపోయిన సమయంలో చెరువు ప్రాంతంలో భూమిని తవ్వి మృతదేహాలను ఖననం చేయడం, తగలబెట్టడంలాంటి చర్యలు ఈ నీటి వనరుకు ఎంతగానో చేటు చేశాయని చెప్పాలి. శ్మశానాలకోసం చెరువు స్థలాన్ని ఆక్రమించడంవల్ల తీవ్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తాయి. ప్రభుత్వ అధికారులు గట్టిగా ప్రయత్నించి చాలావరకూ చెరువు ఆక్రమణలను అరికట్టగాలిగారు.

కానీ సమాధులు, సిమెంట్ బ్లాకుల నిర్మాణాలను మాత్రం అడ్డుకోలేకపోయారు. కొద్దిగా నీరు తగ్గగానే మృతదేహాలను పాతిపెట్టడంవల్ల అనేక అనర్థాలు కలుగుతాయి. మళ్లీ నీటిమట్టం బాగా పెరిగినప్పుడు ఆ మృతదేహాలు డీకంపోజ్ అయిపోయి పూర్తి స్థాయిలో నీటిలో కలిసిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.

Next Story