రాత్రి 8గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని
By Newsmeter.Network Published on 12 May 2020 1:12 PM ISTప్రధాని నరేంద్ర మోదీ రాత్రి 8గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలను వివరించనున్నారు. పీఎంవో ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ మంగళవారంకు 49వ రోజుకు చేరుకుంది. ఇటీవల లాక్‌డౌన్ సడలింపులు చేశారు. కాగా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే వస్తుంది. మంగళవారం నాటికి దేశవ్యాప్తంగా 70,756 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో పలువురి డిచ్చార్జి అయినప్పటికీ 2,293 మంది మృత్యువాత పడటం ఆందోళనకు గురిచేస్తుంది. ఇదిలాఉంటే లాక్‌డౌన్ సడలింపుతో ప్రజలంతా బయటకు వస్తున్నారు. దీంతో వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.
Also Read :పట్టాలెక్కిన రైళ్లు.. ఎక్కడెక్కడ నడుస్తాయంటే..
ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్రాల సీఎంలతో మోదీ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీలో పలు రాష్ట్రాల సీఎంలు లాక్‌డౌన్ కొనసాగింపు, నిబంధనల సడలింపుపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. లాక్‌డౌన్ పొడగిస్తేనే బాగుంటుందని పలువురు సీఎంలు తమ అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. ఈనెల 17తో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ గడువు ముగియనుండటంతో ప్రధాని మోదీ ప్రసంగంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. లాక్‌డౌన్ పొడగింపుకే మోదీ ప్రాధాన్యతనివ్వనున్నట్లు తెలుస్తోంది. మే చివరి వరకు లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లాక్‌డౌన్ పొడిగిస్తే నిబంధనల సడలింపు ప్రస్తుతం లాగే ఉంటుందా.. మరిన్ని వర్గాలకు సడలింపు ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆరెంజ్, గ్రీన్ జోన్‌లలో మాత్రమే కొన్ని విభాగాల దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చారు. లాక్‌డౌన్ పొడగిస్తే ఎప్పటి వరకు పొడిగిస్తారు..? నిబంధనల సడలింపు ఇంకేరంగాలకు ఉంటాయి..? అనే అంశాలపై మోదీ క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.