శిరోముండనం కేసుపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Aug 2020 4:39 PM IST
శిరోముండనం కేసుపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం

ఏపీలో దళిత యువకుడికి పోలీసులు శిరోముండనం చేసిన కేసుపై భారత రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ బాధితుడికి అండగా నిలబడేందుకు ప్రత్యేక అధికారిని నియమించారు. ఇసుక మాఫియా ను అడ్డుకున్నందుకు తనను కొట్టి శిరోముండనం చేయించారని, తనకు న్యాయం చేయకపోతే మావోయిస్టుల్లో కలిసి పోతానని బాధితుడు ప్రసాద్ రాష్ట్రపతికి లేఖ రాశారు. తాజాగా లేఖ పై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం.. బాద్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఇప్పటికే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్నామని ఏపీ ప్రభుత్వం రాష్ట్రపతి కార్యాలయానికి సమాచారం ఇచ్చింది.

బాధితుడికి అండగా ఉండేందుకు అసిస్టెంట్ సెక్రటరీ జనార్దన్ బాబును కేటాయించారు. ఈ విషయంలో పూర్తి వివరాలతో జనార్దన్‌ బాబును కలవాలని బాధితుడు ప్రసాద్ కు రాష్ట్రపతి కార్యాలయం సూచించింది. దీంతో త్వరలో పూర్తి ఆధారాలతో బాధితుడు జనార్థన్‌బాబును కలవనున్నారు.

తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో స్థానిక వైసీపీ నాయకుడి అనుచరుడి ఫిర్యాదు మేరకు ఇటీవల వెదుళపల్లిలో వరప్రసాద్‌ అనే ఎస్సీ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. తీవ్రంగా గాయపరచడంతో పాటు పోలీస్ స్టేషన్‌లోనే అతడికి శిరోముండనం చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఎస్ఐ ఫిరోజ్‌తో పాటు ఓ కానిస్టేబుల్‌ని కూడా సస్పెండ్ చేసి వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా న‌మోదు చేశారు. కాగా.. ఈ ఘటనతో మనస్తాపం చెందిన తాను నక్సలైట్లలో కలుస్తానని బాధిత యువకుడు వరప్రసాద్‌ రాష్ట్రపతికి లేఖ రాశారు.

Next Story