కరోనా వైరస్‌ ప్రభావం భారత్‌లోనూ వేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్‌ భారిన పడి ఇప్పటి వరకు 2వేలకుపైగా మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 59 మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను ఆదిలోనే కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపట్టింది. మార్చి 24 నుంచే దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను విధించింది. కరోనా అనుమానితులను క్వారంటైన్‌ చేశారు. ఇలా క్వారంటైన్‌లో ఉన్న మహిళ మార్చి 28న ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో దేశంలోనే తొలి క్వారంటైన్‌ బర్త్‌ కేసుగా రికార్డుల్లోకి ఎక్కింది.

also Read :నిద్రపోయాడు.. లేచి చూసేసరికి అద్భుతం.. అలాఎలా జరిగింది?

కరోనా నేపథ్యంలో కార్గిల్‌కు చెందిన ఓ కుటుంబాన్ని అధికారులు క్వారంటైన్‌ చేశారు. ఆ కుటుంబంలోని 30ఏళ్ల జహ్రా బాను నిండు చూలాలు. ఆమె సోదరుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో వారి కుటుంబ సభ్యులందరిని క్వారంటైన్‌ చేశారు. జహ్రా గర్భవతి కావడంతో నొప్పులు వస్తుండటంతో అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. మార్చి 28న ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో దేశంలోనే తొలి క్వారంటైన్‌ బర్త్‌ కేసుగా కార్గిల్‌లో అధికారులు నమోదు చేశారు. జహ్రా జన్మనిచ్చిన శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 3.5 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు.

also Read :ఏపీలో 132కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు.. ఒక్కరోజే..

అయితే శిశువును చూసేందుకు కుటుంబ సభ్యులెవరూ రాలేదు. ఆమె కుటుంబ సభ్యులంతా క్వారంటైన్‌లో ఉండటంతో పాటు, జహ్రా భర్త కూడా క్వారంటైన్‌లోనే ఉండటంతో బిడ్డను చూసేందుకు వారు రాలేకపోయారు. దీంతో ఆస్పత్రి సిబ్బందే అన్నీతామై చూసుకున్నారు. క్వారంటైన్‌లో ఉన్న జహ్రా గడువు మంగళవారంతో ముగియనుందని వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులను ఎప్పుడు కలుసుకోవాలా అని ఆత్రుతగా ఎదురుచూస్తుందని అక్కడి సిబ్బంది తెలిపారు. మరోవైపు కుటుంబ సభ్యులతో కలిసి బారసాల వేడుకలు చేసుకొనేందుకు జ్రహాతో పాటు కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్