ఏపీలో 132కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. ఒక్కరోజే..
By Newsmeter.Network Published on 2 April 2020 12:05 PM ISTప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లోనూ వేగంగా విస్తరిస్తోంది. మొన్నటి వరకు వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉందని భావించినప్పటికీ.. ఢిల్లిలో జరిగిన మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారికి వైరస్ సోకడం.. వారి నుంచి వ్యాప్తి చెందుతుండటంతో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలోనూ బుధవారం ఒక్కరోజే 67 పాజిటివ్ కేసులు నమోదు కాగా, గురువారం మధ్యాహ్నం సమయానికి 21 పాజిటివ్ కేసులు నమోదుకావటం ఆందోళనకు గురిచేస్తోంది. ఏపీలో కరోనా వైరస్ ప్రభావంపై గురువారం ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ను విడుదల చేసింది. ఏపీలో మొత్తం 132 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Also Read :ఖాళీగా ఉన్నారా..? అయితే మీరూ నాలాగే ట్రై చేయండి..!
గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 20 చొప్పున, ప్రకాశం జిల్లాలో 17, కడప, కృష్ణా జిల్లాల్లో 15, పశ్చిమ గోదావరి జిల్లాలో 14, విశాఖపట్టణంలో 11, చిత్తూరు జిల్లాలో 8, తూర్పుగోదావరి జిల్లాలో 9, అనంతపురం జిల్లాలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 1800 మంది నమూనాలు పరీక్షించగా.. 1175 మందికి నెగిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 493 మంది ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇదిలాఉంటే శ్రీకాకుళం, విజయ నగరం జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసుకూడా నమోదు కాకపోవటం ఆ జిల్లా వాసులకు కొంత ఊటర కలిగిస్తోంది. శ్రీకాకులం జిల్లాలో మొత్తం 45 మంది నుంచి పరీక్షల రక్తనమూనాలు సేకరించగా.. 20మందికి నెగిటివ్ వచ్చిందని, మరో 25 మంది పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. అదేవిధంగా విజయనగరంలో మొత్తం 12మంది పరీక్షల నిమిత్తం రక్త నమూనాలు సేకరించగా.. 12మందికి నెగిటివ్ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
Also Read :నిద్రపోయాడు.. లేచి చూసేసరికి అద్భుతం.. అలాఎలా జరిగింది?
మరోవైపు ఏపీ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారి ప్రాంతాల్లో పటిష్ట ఏర్పాటు చేశారు. ఎవరూ బయటకు రావొద్దని పోలీసులు స్థానికులకు సూచిస్తున్నారు. ప్రస్తుతం పాజిటివ్ కేసులు నమోదవుతున్న వారిలో ఢిల్లిలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారే అధికంగా ఉన్నారని అధికారులు పేర్కొంటున్నారు. ప్రార్థనల్లో పాల్గొన్న వారందరినీ పరీక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.ఢిల్లిలో ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ముస్లింలు స్వచ్ఛందంగా రక్త పరీక్షలకు రావాలని అధికారులు కోరుతున్నారు.