నిద్రపోయాడు.. లేచి చూసేసరికి అద్భుతం.. అలాఎలా జరిగింది?

By Newsmeter.Network  Published on  1 April 2020 8:48 AM GMT
నిద్రపోయాడు.. లేచి చూసేసరికి అద్భుతం.. అలాఎలా జరిగింది?

సోషల్‌ మీడియా.. ఎప్పుడు ఎవరిని హీరోను చేస్తుందో.. ఎప్పుడు ఎవరిని జీరోను చేస్తుందో చెప్పడం కష్టమే. ఎంతో శ్రద్దతో కష్టపడి సోషల్‌ మీడియాలో వీడియోలు చేసినా కొందరికి లైక్‌లు రావు.. కానీ కొందరు సరదాగా చేసిన వీడియోలతోనే రాత్రికి రాత్రే పాపులర్‌ అవుతారు. ఇదే ఘటన చైనాలో ఓ యువకుడికి ఎదురైంది. ప్రతీ రోజూ కొత్త కొత్త వీడియోలు చేస్తూ టిక్‌టాక్‌లో పోస్టు చేసినా రాని పాపులారిటి.. కేవలం నిద్ర పోవటం వల్ల వచ్చింది. ఇది నమ్మశక్యం కాకపోయినా.. నమ్మాల్సిందే.

చైనాలోని జియాంగ్జి ప్రావిన్స్‌లో యువన్సన్‌ అనే యువకుడు ఎప్పుడూ సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌లో వీడియోలు పోస్టు చేస్తుండేవాడు. అతను ఎన్ని మంచి వీడియోలు పెట్టినా, రిస్క్‌ తీసుకొని చేసిన విన్యాసాలతో వీడియోలు పెట్టినా ఆశించిన స్థాయిలో లైక్‌లు రాకపోయేవి. కానీ యువన్సన్‌ సరదాగా కాలక్షేపం కోసం నిద్రపోతూ పెట్టిన లైవ్‌ స్ట్రీమింగ్‌ రికార్డు అతన్ని ఒక్కసారిగా పాపులర్‌ చేసింది. ఎంతగా అంటే.. అతను కలలోకూడా ఆ స్థాయిలో ఊహించనంతగా..

చైనాలో కరోనా వైరస్‌ ప్రభావంతో అన్ని మూతపడ్డాయి. దీంతో యువన్సన్‌ చేసేది ఏమీలేక ఇంట్లోనే ఉండిపోయాడు. దీంతో సరదాగా తాను నిద్రపోతుండగా.. టిక్‌టాక్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ రికార్డు చేశాడు. ఐదు గంటల తరువాత నిద్రలేచి చూసేసరికి యువన్సన్‌ నమ్మలేని అద్భుతం చోటు చేసుకుంది. ఇంతకాలం కష్టపడి వీడియోలు చేసి టిక్‌టాక్‌లో పెట్టినా రాని లైక్‌లు ఒక్కసారిగా కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి. యువన్సన్‌ నిద్ర పోతున్న వీడియోను టిక్‌టాక్‌ యూజర్లు తెగ లైక్‌లు కొట్టారు. దీంతో అతడి వీడియోలను చూసిన వారి సంఖ్య 1.85కోట్లకు చేరింది. దాదాపు 10లక్షల మంది అతడికి ఫాలోవర్స్‌గా మారారు. ఫలితంగా ఒక్కసారిగా టిక్‌టాక్‌లో పాపులర్‌ స్టార్‌గా మారిపోయాడు.

అంతేకాక యువన్సన్‌ పాపులారిటీ చూసి మీడియా సంస్థలు కూడా అతడి ఇంటర్వ్యూలు తీసుకున్నాయంటే అతని నిద్రపోవటంలో ఎంత మహత్యం ఉందో మరి. దీనికితోడు యువన్సన్‌ నిద్రను మెచ్చిన వీక్షకులు అతడికి రూ. 8.31 లక్షలు విలువ చేసే వర్చువల్‌ బహుమతులు కూడా పంపించటం కొసమెరుపు. ఆ తరువాత యూవన్సన్‌ అతడు తీసిన వీడియోలను టిక్‌టాక్‌లో పెట్టినా.. టిక్‌టాక్‌ యూజర్లు మాత్రం నీ నిద్రపోతున్న వీడియోలు ఏవీ, ఎందుకు నువ్వు నిద్ర పోవటం లేదంటూ తెగ ప్రశ్నలు వేస్తున్నారంట. దీనిపై యువన్సన్‌ మాట్లాడుతూ.. అసలు నా నిద్రలో ఏముందో నాకే తెలియడం లేదు. నేనే నిద్రపోతున్న వీడియో వీక్షకులకు ఎందుకు నచ్చిందో అర్థం కావటం లేదు.. నిద్ర వీడియోలు చేసిచేసి బోర్‌ కొట్టింది.. ఇకపై అలాంటి వీడియోలను మళ్లి పోస్టు చేయను అని యువన్సన్‌ అన్నాడంట.

Next Story